‘ఆప్’‌ను నిందితుల జాబితాలో చేర్చిన ఈడీ.. ఎనిమిదో ఛార్జిషీట్‌‌‌ సంచలనం

by Hajipasha |   ( Updated:2024-05-17 15:18:16.0  )
‘ఆప్’‌ను నిందితుల జాబితాలో చేర్చిన ఈడీ.. ఎనిమిదో ఛార్జిషీట్‌‌‌ సంచలనం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ న్యాయశాస్త్రంలో కొత్త అధ్యాయానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెరతీసింది. తొలిసారిగా ఒక రాజకీయ పార్టీని ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని, దాని జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను నిందితుల జాబితాలో ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఎనిమిదో ఛార్జిషీట్ ఇది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించిన తొలి ఛార్జిషీట్ ఇదే కావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చడం అనేది.. దాని మనుగడకు ప్రతికూలంగా పరిణమించే ముప్పు ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. తదుపరిగా ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈడీ లేఖ రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికార దుర్వినియోగం, నేరపూరిత కుట్రల ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందున ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఈడీ కోరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంతో సహా పార్టీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.

సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు చెప్పింది కూడా ఇదే..

వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా నిందితుల లిస్టులో చేర్చాలనే అంశాన్ని తొలుత ప్రస్తావించింది సుప్రీంకోర్టే. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరిందని మీరు అంటున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీని ఎందుకు నిందితుల జాబితాలో చేర్చకూడదు ?’’ అని గతేడాది అక్టోబరులో కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. ‘‘ఏదైనా రాజకీయ పార్టీని చిక్కుల్లో పెట్టాలనే ఉద్దేశంతో మేం ఈ మాట అనడం లేదు. మాది కేవలం న్యాయపరమైన ప్రశ్న’’ అని సుప్రీంకోర్టు బెంచ్ ఈడీకి స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ విచారిస్తూ కీలక వ్యాఖ్య చేసింది. ‘‘మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 పరిధిలోకి రాజకీయ పార్టీని కూడా తీసుకురావచ్చు’’ అని న్యాయస్థానం పేర్కొంది. ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం 'రాజకీయ పార్టీ' అంటే 'వ్యక్తులతో కూడిన సంఘం'. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం 'కంపెనీ ' అన్నా.. 'వ్యక్తుల సంఘం' అనే అర్థమే వస్తుంది. అందుకే రాజకీయ పార్టీకి కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని వర్తింపజేయవచ్చు’’ అని ఈడీకి ఢిల్లీ హైకోర్టు బెంచ్ తెలిపింది.

ఆప్‌కు రూ.100 కోట్ల ముడుపులు : సీబీఐ

ఢిల్లీలోని ఆప్ సర్కారు రూపొందించిన లిక్కర్ పాలసీ వల్ల మద్యం కంపెనీలు 12 శాతం లాభాలను గడించాయని సీబీఐ ఆరోపించింది. "సౌత్ గ్రూప్" అనే లిక్కర్ లాబీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల దాకా ముడుపులు అందాయని సీబీఐ తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ ముడుపులు ముట్టాయని పేర్కొంది. ఈ కేసులో ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story