- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaishankar: తాలిబన్ విదేశాంగ శాఖ తాత్కాలిక మంత్రితో జైశంకర్ చర్చలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ తాత్కాలిక మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) ఫోన్‌లో మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ తాత్కాలిక మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) ఫోన్‌లో మాట్లాడారు. పహెల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. ఈవిషయాన్ని కేంద్రమంత్రి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తాలిబన్ (Taliban) ప్రభుత్వంతో భారత్ తో మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ‘‘అఫ్గాన్ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్‌తో మంచి సంభాషణ జరిగింది. పహెల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ, నిరాధార ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా. అఫ్గాన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం’’ అని జైశంకర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
జమ్ముకశ్మీర్ లోని..
మరోవైపు, ఇటీవలే జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత అఫ్గాన్, ఇరాన్, పాకిస్థాన్ లోని భారత రాయబార బృందం కాబుల్ లోని తాలిబన్ అధికారులతో చర్చలు జరిపింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రవాణా సహకారాన్ని మెరుగుపరచడంతో పాటు ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. 2021 ఆగస్టులో అఫ్గాన్‌లో తాలిబన్ పాలన ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించనప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మరోవైపు, అఫ్గాన్‌లో అల్‌ఖైదా, ఐసిస్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్రముఠాల ఉనికిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరపడం గమనార్హం.






