సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తిరస్కరణ

by Gantepaka Srikanth |

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని (Impeachment Motion) రాజ్యసభ చైర్మన్ తోసిపుచ్చారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తిరస్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని (Impeachment Motion) రాజ్యసభ చైర్మన్ తోసిపుచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలో విపక్షాలు సమర్పించిన ఈ నోటీసును నిబంధనల మేరకు లేదని చైర్మన్ తిరస్కరించారు. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో లోక్‌సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది సభ్యులు ఉన్నారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ తీర్మానాన్ని ముందుకు తెచ్చింది. ఎన్నికల ప్రక్రియలో పక్షపాత ధోరణి, ఓటర్ల జాబితాలో అవకతవకలు వంటి సుమారు ఏడు ఆరోపణలను విపక్షాలు ఈ నోటీసులో పేర్కొన్నాయి. రాజ్యసభ నిబంధనల ప్రకారం, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అభిశంసన కోరేందుకు తగిన ఆధారాలు, ప్రక్రియ ఉండాలని, ప్రస్తుతం సమర్పించిన నోటీసులో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంటూ చైర్మన్ దానిని తిరస్కరించారు.

నేపథ్యం..

భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావడం ఇదే తొలిసారి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ 'ఇండియా' (INDIA) కూటమిలోని ప్రధాన పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే చైర్మన్ నిర్ణయంతో ఈ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. దీనిపై ప్రతిపక్షాలు తదుపరి కార్యాచరణను ఎలా రూపొందిస్తాయో చూడాలి.

Next Story