Yunus:బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగేది 2026లోనే

by Shamantha N |   (  Updated:2025-05-29 07:05:41  IST  )

బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నారు.

Yunus:బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగేది 2026లోనే
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఎన్నికలపై మహమ్మద్ యూనస్ మరోసారి మాట్లాడారు. 2026లోనే ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల గురించి ప్రకటన చేశారు (Bangladesh Polls). తమ దేశంలో ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌- 2026 జూన్‌ మధ్య జరగొచ్చని చెప్పారు. కొన్ని సంస్కరణలు చేపడుతున్నామని, అవి పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.

సవాళ్లు ఎదుర్కొంటున్న యూనస్ ప్రభుత్వం

ఇటీవల యూనస్‌ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్- ఉజ్‌- జమాన్‌ (Waker-Uz-Zaman)తో నెలకొన్న విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్‌ తీసుకొంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్‌ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈక్రమంలోనే ఎన్నికల నిర్వహణపై ఆయన మరోసారి జపాన్ లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. ఇకపోతే, పదహారేళ్లపాటు కొనసాగిన షేక్‌ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం వల్ల పతనమైంది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె.. స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు.

Next Story