ముంబైలో రెడ్ అలర్ట్.. విమాన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ

by Naga Rani Yarlagadda |

చురుగ్గా కదులుతోన్న రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ముంబైలో రెడ్ అలర్ట్.. విమాన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: చురుగ్గా కదులుతోన్న రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో రెయిన్ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. పలు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి. ప్రయాణికులు నిర్ణీత సమయంకంటే ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.

నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అకారణమైన ప్రయాణాలను మానుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉండటంతో అనేక ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు. రాయ్ ఘర్ కు ఆరెంజ్ అలర్ట్, పాల్ఘర్, థానేలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Next Story