జేఈఈలో డేటా లీక్ భయాలు.. తీవ్రంగా ఖండించిన ఐఐటీ రూర్కీ

by Naga Rani Yarlagadda |

రెండ్రోజులుగా జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు సంబంధించిన పర్సనల్ డేటా లీకైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటం మరో కలకలానికి దారితీసింది.

జేఈఈలో డేటా లీక్ భయాలు.. తీవ్రంగా ఖండించిన ఐఐటీ రూర్కీ
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ - 2026 పేపర్ లీక్ విషయం దేశంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. రెండ్రోజులుగా జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు సంబంధించిన పర్సనల్ డేటా లీకైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటం మరో కలకలానికి దారితీసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతుండగా.. లీకేజీపై ఐఐటీ రూర్కీ స్పందించింది. జేఈఈ అడ్వాన్స్ డ్ అభ్యర్థుల వ్యక్తిగత డేటా లీకైందన్న వార్తల్ని తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సమాచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని, అసలు జరిగిన దానికి, దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికైన ఎక్స్ లో ఐఐటీ రూర్కీ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. నిజానికి చాలా దూరంగా ఉన్న తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.

"లక్షలాది మంది జేఈఈ అడ్వాన్స్ డ్ అభ్యర్థుల డేటా లీకైందని, వారి గోప్యతకు భంగం కలిగిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ముమ్మాటికీ తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. అవన్నీ వాస్తవ విరుద్ధమైనవే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారంలో నిజం లేదు. అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దు" అని ఐఐటీ రూర్కీ ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొంది. క్లౌడ్ స్టోరేజీ కాన్ఫిగరేషన్ లో తలెత్తిన సమస్య కారణంగా జేఈఈ అడ్వాన్స్ డ్ అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కిందన్న నివేదికలపై ఆన్లైన్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. ఐఐటీ రూర్కీ దానిపై క్లారిటీ ఇచ్చింది. 'రైలన్ అనిల్' అనే ఎథికల్ హ్యాకర్ ఈ లోపాన్ని గుర్తించి సమాచారం అందించిన వెంటనే.. ఐఐటీ రూర్కీ అప్రమత్తమై ఆ సమస్యను పరిష్కరించింది. ఆ డేటాకు ఉన్న యాక్సెస్‌ను తక్షణమే నిలిపివేసింది. ఈ చిన్న సాంకేతిక లోపం వల్ల పరీక్ష ఫలితాలు, మార్కులు, ర్యాంకులు లేదా అభ్యర్థుల కేటగిరీలపై ఎలాంటి ప్రభావం పడబోదని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది.

అర్హత ప్రమాణాల సడలింపు లేదు

ఇదే సమయంలో, సీబీఎస్‌ఈ ఓఎస్ఎమ్ (CBSE OSM) వివాదం నేపథ్యంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ నిధుల సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అర్హత ప్రమాణాల (Eligibility Norms) సడలింపును ఐఐటీ రూర్కీ పూర్తిగా తోసిపుచ్చింది. నియమ నిబంధనలలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అయితే.. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము సీబీఎస్‌ఈ (CBSE) తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏఎన్‌ఐ (ANI) నివేదిక ద్వారా సంస్థ ధృవీకరించింది.

Next Story