గాలిలోని కాలుష్యంతో ఇంధనం.. ఐఐటీ గువాహ‌టి పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ

by Naga Rani Yarlagadda |

ఐఐటీ గువాహటి పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. గాలిలో ఉన్న కాలుష్యంతో హరిత ఇంధనాన్ని తయారు చేయవచ్చని కనుగొన్నారు.

గాలిలోని కాలుష్యంతో ఇంధనం.. ఐఐటీ గువాహ‌టి పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువాహటి పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చారు. గాలిలో ఉండే హానికారక కార్బన్ డై ఆక్సైడ్ ను సూర్యరశ్మి ద్వారా మిథనాల్ ఇంధనంగా మార్చగలిగే ఫొటోకెటలిస్ట్ అనే పదార్థాన్ని అభివృద్ధి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ ప్రచురించింది. పెట్రోలియం ఆధారిత ఇంధనాలను వాడటం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగి పర్యావరణానికి, భూతాపానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధన ఉత్పత్తి దిశగా ఐఐటీ గువాహటి సైంటిస్టులు ఈ కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్స్, సిమెంటు, ఉక్కు, పెట్రోకెమికల్ పరిశ్రమల నుంచి వెలువడే CO2ను ఇంధనంగా మార్చి.. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.

కానీ గతంలోనూ దీనిపై పరిశోధనలు జరిగాయి. గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైడ్ అనే పదార్థంతో ఇలాంటి ప్రయత్నాలు జరగ్గా.. శక్తి నష్టం కారణంగా అది విఫలమైంది. తాజాగా ఐఐటీ గువాహటి సైంటిస్టులు గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైట్ కు ఫ్యూ లేయర్ గ్రాఫీన్ ను జోడించడం ద్వారా సమస్యను అధిగమించారు. దీనివల్ల పర్యావరణ సమస్యలను తగ్గించడంతో పాటు.. హరిత ఇంధన ఉత్పత్తికి ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ మహుయా దే తెలిపారు.

Next Story