‘స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపిస్తాం’.. వలసదారులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులను గుర్తించి, వారిని వెనక్కి పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

‘స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపిస్తాం’.. వలసదారులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులను గుర్తించి, వారిని వెనక్కి పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గురువారం గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రూ. 340 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జాతీయ భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సరిహద్దుల రక్షణ కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు.

బెంగాల్‌లో మారుతున్న పరిస్థితులు..

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మారుతున్న పరిస్థితులపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. గతంలో మమతా బెనర్జీ పాలనలో నిత్యం చొరబాట్లు జరిగేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వలసదారులు తమంతట తామే స్వచ్ఛందంగా వెనక్కి వెళ్తున్నారని, అలా వెళ్లేవారిపై ఎలాంటి కేసులు ఉండవని తెలిపారు. ఒకవేళ స్వచ్ఛందంగా వెళ్లకపోతే, బలవంతంగానైనా వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.

బీఎస్ఎఫ్‌కు వేగంగా భూమి కేటాయింపు

సరిహద్దుల్లో ఫెన్సింగ్ (కంచె) పనుల అడ్డంకులు తొలగిపోవడంపై హోంమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మౌలిక వసతుల బలోపేతం కోసం కేవలం వారం రోజుల్లోనే 600 హెక్టార్ల భూమిని కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.

గుజరాత్‌లో పలు కార్యక్రమాలు

మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా అమిత్ షా పలు సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద నిర్మించిన జెద్వా గ్రామీణ చెరువు పునరుద్ధరణ, నూతన గ్రంథాలయాలు, ప్రాథమిక పాఠశాల భవనాలను ప్రారంభించారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లో ‘భారత్ మాతా స్క్వేర్’తో పాటు మాతా ఉమియా ధామ్ కాంప్లెక్స్‌లో హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. భారత్‌లో జరగబోయే ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడల మౌలిక వసతుల సన్నద్ధతపై షాహిబాగ్ సర్క్యూట్ హౌస్‌లో జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించనున్నారు.

Next Story