బీఫ్ తినడం తప్పు కానప్పుడు.. గోమూత్రం తాగితే తప్పెలా? : మాజీ గవర్నర్ తమిళిసై

by Ajay Maddhiboyina |

ఒక సన్యాసి మాత్రం గోమూత్రాన్ని తాగించమని సలహా ఇచ్చారని, అది తాగిన 15 నిమిషాల్లో తన తండ్రి జ్వరం తగ్గిపోయిందని కామకోటి వెల్లడించారు.

బీఫ్ తినడం తప్పు కానప్పుడు.. గోమూత్రం తాగితే తప్పెలా? : మాజీ గవర్నర్ తమిళిసై
X

దిశ, నేషనల్ బ్యూరో:

దేశంలో ఒక వర్గం బీఫ్ తినడం సరైనదే అని చెబుతున్నప్పుడు, గో మూత్రం తాగడం మాత్రం తప్పెలా అవుతుంది. గోమూత్రంపై చేస్తున్నవి అన్నీ అసమంజసమైన విమర్శలే అని బీజేపీ నేత, మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి గోమూత్రంపై చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. కామకోటి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడ్డారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వి. కామకోటి గోమూత్రం ద్వారా కలిగే లాభాలను వివరించారు. తన తండ్రికి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు తాను ఒక డాక్టర్‌ను పిలవాలని భావించారు. కానీ ఒక సన్యాసి మాత్రం గోమూత్రాన్ని తాగించమని సలహా ఇచ్చారని, అది తాగిన 15 నిమిషాల్లో తన తండ్రి జ్వరం తగ్గిపోయిందని కామకోటి వెల్లడించారు. గోమూత్రంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపులో చికాకు కలిగించే సిండ్రోమ్‌ను తగ్గిస్తుందని కామకోటి వివరించారు. అమెరికాలో దీనిపై ఐదు పరిశోధనలు జరిగాయి. గోమూత్రం వల్ల కలిగే లాభాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయని కామకోటి చెప్పుకొచ్చారు. అయితే కామకోటి వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌గా ఉంటూ సూడోసైన్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. డీఎంకే సీనియర్ నేత ఎలంగోవన్ కూడా కామకోటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జ్వరం వస్తే తగ్గడానికి గోమూత్రం తాగమని చెప్పడానికి ఆయన డాక్టర్ కాదు. అసలు డాక్టర్లు కూడా ఇలా సలహా ఇవ్వరు. డాక్టర్లే కాదు ఎవరూ జ్వరానికి గోమూత్రాన్ని మందుగా సూచించరని ఎలంగోవన్ అన్నారు. కామకోటిని వెంటనే ఐఐటీ నుంచి ఎయిమ్స్‌‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కామకోటిని తమిళిసైతో పాటు బీజేపీ తమిళనాడు చీఫ్ కే.అన్నామలై వెనుకేసుకొచ్చారు.

Next Story