PM Modi: సిందూరాన్ని తుడిచి పెట్టే ప్రయత్నానికైనా ప్రతీకారం తీర్చుకుంటాం- మోడీ

by Shamantha N |

భారతీయ సోదరీమణుల సిందూరాన్ని తుడిచి పెట్టే ఏ ప్రయత్నానికైనా తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

PM Modi: సిందూరాన్ని తుడిచి పెట్టే ప్రయత్నానికైనా ప్రతీకారం తీర్చుకుంటాం- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ సోదరీమణుల సిందూరాన్ని తుడిచి పెట్టే ఏ ప్రయత్నానికైనా తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ దాహోద్ లో రూ.24 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ఆ దేశం ఏకైక లక్ష్యం భారత్‌ను ద్వేషించడం, భారత్ కు ముప్పు కలిగించే మార్గాలు అన్వేషించడమే అని మండిపడ్డారు. కానీ, భారత్‌ మాత్రం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి సాధించడం, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే లక్ష్యంగా నిర్దేశించుకొని ముందుకెళ్తోందని చెప్పారు. ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ప్రధాని 'ఆపరేషన్ సిందూర్' కేవలం సైనిక చర్య కాదని, భారతదేశ విలువలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారని, అందువల్లే సాయుధ దళాలకు స్వేచ్ఛా హస్తం ఇచ్చామని మరింత వివరించారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం చూడనిది మన సైనికులు చేసి చూపించారని కొనియాడారు. ఏప్రిల్ 22న జరిగిన పహెల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మన బలగాలు కేవలం 22 నిమిషాల్లోనే వారి అతిపెద్ద ఉగ్రవాద శిబిరాన్ని నాశనం చేశారని ప్రశంసించారు.

ఇదే రోజు..

2014లో ఇదేరోజు తొలిసారి పీఎంగా బాధ్యతలు చేపట్టానని మోడీ (PM Modi) గుర్తుచేసుకున్నారు. మొదటగా గుజరాత్‌ ప్రజలు తనను ఆశీర్వదించారని, తర్వాత కోట్లాది మంది భారతీయులు ఆశీస్సులు అందించారని అన్నారు. ఈ పర్యటనలో దాహోద్‌లో వేల కోట్లు రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ(PM Narendra Modi) ప్రారంభించారు. వెరావల్‌-అహ్మదాబాద్ మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, వల్సాద్‌-దాహోద్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపారు. ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘‘దేశాన్ని వికసిత్ భారత్‌ దిశగా మార్చేందుకు 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఈ 11 ఏళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. దశాబ్దాల నాటి సంకెళ్లను బద్దలు కొట్టి, దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతున్నాం. కార్లు, ఫోన్లు, బొమ్మలు, ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాం. మూడు సంవత్సరాల క్రితం ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాను. దీనిపై ఎన్నో విమర్శలు వినిపించాయి. ఎన్నికల సమయం కాబట్టి ప్లాంట్‌కు పునాది వేశారు కానీ ఏ నిర్మాణాలు చేపట్టరని విమర్శించారు. కానీ ఈ రోజు ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ తయారైంది. అది మనకు కనిపిస్తోంది’’ అని మోడీ అన్నారు. మరోవైపు, మోడీ నిర్వహించిన ర్యాలీలో కర్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం పాల్గొనడం గమనార్హం. వారు మోడీపైన పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.

Next Story