- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీయూనే కల్యాణ మండపమైంది.. బెడ్‌పై ఉన్న వధువుకు సింధూరం దిద్దిన వరుడు! వైరల్
పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఊహించని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఊహించని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది. దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. కానీ, ఆ వరుడు వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక అనుమతితో ఐసీయూలోనే ఆమెను వివాహం చేసుకొని తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ భావోద్వేగ భరితమైన సంఘటన రెండు కుటుంబాలకే కాకుండా చూసిన ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రమాదం జరిగిందిలా.. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్స్‌గావ్‌లోని హత్వార్ గ్రామానికి చెందిన పూజా యాదవ్ (25) ఎల్‌ఎల్‌ఎం చదువుతోంది. మహువా గ్రామానికి చెందిన సన్నీ యాదవ్ (29)తో బుధవారం ఆమె వివాహం జరగాల్సి ఉంది. అయితే అదే రోజు ఆమెకు పరీక్ష ఉండటంతో ఉదయం ఖలీలాబాద్ వెళ్లింది. పరీక్ష ముగిసిన అనంతరం మధ్యాహ్నం తన సోదరుడు అమన్ యాదవ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై గోరఖ్‌పూర్ తిరిగి వస్తుండగా ఆమెకు ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో పూజకు తీవ్ర గాయాలు కావడంతో పాటు విపరీతంగా రక్తస్రావం జరిగింది. వెంటనే ఆమెను గోరఖ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఐసీయూలో పెళ్లి..
వధువుకు ప్రమాదం జరగడంతో పెళ్లి ఆగిపోతుందని రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కానీ వరుడు సన్నీ యాదవ్ ధైర్యంగా ముందుకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకొని తీరుతానని స్పష్టం చేశాడు. ఆసుపత్రి వర్గాలను అభ్యర్థించి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు. తగిన జాగ్రత్తల మధ్య గురువారం వేకువజామున 1 గంట ప్రాంతంలో ఐసీయూలోనే వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సిబ్బంది, బంధువుల సమక్షంలో వధువు నుదుట సన్నీ సింధూరం దిద్ది, తన ధర్మపత్నిగా స్వీకరించాడు.
నిలకడగా వధువు ఆరోగ్యం..
కష్టకాలంలో వరుడు తీసుకున్న ఈ నిర్ణయం తమ రెండు కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని వధువు సోదరుడు అమన్ యాదవ్ తెలిపాడు. ప్రస్తుతం పూజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఆసుపత్రిలో ప్రధాన ఘట్టం ముగిసిన తర్వాత, వరుడు తన గ్రామానికి తిరిగి వెళ్లి మిగిలిన వివాహ ఆచారాలను పూర్తి చేయగా, వధువు ఇంట్లో జరగాల్సిన ఇతర సంప్రదాయ కార్యక్రమాలను బంధువులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, వరుడి గొప్ప మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరు అతనిపై మండిపడుతున్నారు. ఆమెకు గాయాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కదా.. ఐసీయూలో సీరియస్ పరిస్థితిలో ఉన్నప్పుడు అవసరమా? అని కొందరు నెటిజన్‌లు పెళ్లికొడుకుపై మండిపడ్డారు.






