ICMR మలేరియా టీకా రెడీ.. ఆ ఐదు కంపెనీలకు లైసెన్స్‌లు జారీ

by Kema Shiva Kumar |

మలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) స్వదేశీ టీకా ‘అడ్‌ఫాల్సివాక్స్’ (AdFalciVax)ను అభివృద్ధి చేసింది.

ICMR మలేరియా టీకా రెడీ.. ఆ ఐదు కంపెనీలకు లైసెన్స్‌లు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: మలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) స్వదేశీ టీకా ‘అడ్‌ఫాల్సివాక్స్’ (AdFalciVax)ను అభివృద్ధి చేసింది. భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRC), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR), బయోటెక్నాలజీ విభాగంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (DBT-NII) సంయుక్తంగా ఈ రీకాంబినెంట్ టీకాను రూపొందించాయి. ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే ప్రాణాంతక పరాన్నజీవి వల్ల వచ్చే మలేరియాను నివారించడంలో అడ్‌ఫాల్సివాక్స్ టీకా కీలక పాత్ర పోషిస్తుంది. మలేరియా సోకిన వ్యక్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడమే కాకుండా, దోమల ద్వారా వ్యాధి వ్యాప్తిని ఈ టీకా నిరోధిస్తుంది.

అదేవిధంగా ప్రీ-క్లినికల్ పరీక్షల్లో అడ్‌ఫాల్సివాక్స్ టీకా మంచి ఫలితాలను చూపింది. దీర్ఘకాల రోగనిరోధక శక్తిని అందిస్తుందని, సాంప్రదాయ టీకాల కంటే విస్తృత రక్షణను కల్పిస్తుందని తేలింది. అడ్‌ఫాల్సివాక్స్ టీకా గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలల పాటు స్థిరంగా నిల్వ ఉంటుందని, ఇది మారుమూల ప్రాంతాలకు రవాణా, స్టోర్ చేసేందుకు సులభమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అయితే, లాక్టోకాకస్ లాక్టిస్ (Lactococcus lactis) అనే సురక్షిత బ్యాక్టీరియాను ఉపయోగించి అడ్‌ఫాల్సివాక్స్ టీకాను తయారు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ టీకా ఉత్పత్తి కోసం ఐదు కంపెనీలకు లైసెన్సులు అందాయి. వాటిలో ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, టెక్‌ఇన్వెన్షన్ లైఫ్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, పానేషియా బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, జైడస్ లైఫ్‌సైన్సెస్ సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టీకా మొదటి బ్యాచ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story