- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నీ జిమ్‌లో చేరతా.. భయపడకు’.. జిమ్ ట్రైనర్ దీపక్‌కు రాహుల్ గాంధీ భరోసా
ఉత్తరాఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మానవత్వాన్ని చాటుకున్నారు. కోటద్వార్‌కు చెందిన జిమ్ ట్రైనర్ మహమ్మద్ దీపక్ కుమార్‌ను సోమవారం కలిసిన రాహుల్, అతనికి పూర్తి మద్దతు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : గత నెలలో ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్‌లో ఒక షాప్ పేరు విషయంలో తలెత్తిన వివాదంలో మత సామరస్యం కోసం నిలబడిన జిమ్ ట్రైనర్ దీపక్ కుమార్‌ను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. దీపక్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్, వారికి ధైర్యం చెప్పారు. వివరాల్లోకి వెళితే.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోటద్వార్‌లోని 'అహ్మద్ బాబా స్కూల్ డ్రెస్' అనే దుకాణం పేరు మార్చాలని కొందరు వ్యక్తులు యజమానితో గొడవకు దిగారు. 'బాబా' అనే పదాన్ని కేవలం సిద్ధబలి బాబాకు మాత్రమే వాడాలని, ఒక ముస్లిం వ్యక్తి ఆ పేరు పెట్టుకోకూడదని వారు వాదించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిమ్ ట్రైనర్ దీపక్ కుమార్, ఆ దుకాణదారుడికి అండగా నిలబడ్డారు. నా పేరు కూడా 'మహమ్మద్ దీపక్' అని, ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
జిమ్‌పై తీవ్ర ప్రభావం..
ఈ వివాదం తర్వాత దీపక్ నిర్వహిస్తున్న జిమ్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఒకప్పుడు రోజుకు 150 మంది సభ్యులు వచ్చే తన జిమ్‌కు, ఇప్పుడు కేవలం 12 నుండి 15 మంది మాత్రమే వస్తున్నారని దీపక్ ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులంతా ఒక్కసారిగా తగ్గిపోవడంతో తన జీవనోపాధి దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. దీపక్ ఉదంతం తెలుసుకున్న రాహుల్ గాంధీ, అతడిని కలిసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ‘ప్రతి ఒక్కరూ సమానమే. ఇదే అసలైన భారతీయత, మొహబ్బత్ కీ దుకాన్, ఇలాంటి ధైర్యం, ఐక్యత ప్రతి భారతీయ యువకుడిలో ఉండాలి’ అని అన్నారు. ‘త్వరలోనే నేను కోటద్వార్ వస్తాను.. నీ జిమ్‌లో సభ్యత్వం తీసుకుంటాను’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఇక, తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు దారుడిని కాదని, కేవలం ఒక సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతానని దీపక్ స్పష్టం చేశారు. జిమ్ చేసే ప్రతి ఒక్కరికీ హనుమంతుడే ఆదర్శమని, ఆయన ఇచ్చే స్ఫూర్తితోనే తాము కష్టపడతామని ఆయన చెప్పుకొచ్చారు.






