ఐదేళ్లూ నేనే కర్ణాటక సీఎం: మరోసారి స్పష్టం చేసిన సిద్ధరామయ్య

by Yella Dhawani Reddy |

నాయకత్వ మార్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి స్పందించారు.

ఐదేళ్లూ నేనే కర్ణాటక సీఎం: మరోసారి స్పష్టం చేసిన సిద్ధరామయ్య
X

దిశ, వెబ్ డెస్క్: నాయకత్వ మార్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి స్పందించారు. కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. వీటిని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ తనను పదవి నుంచి వైదొలగాలని ఆదేశించిందనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘సీఎం మార్పు’పై స్పష్టతనిచ్చారు.

'నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను. నేను సీఎంగా దిగిపోయి డీకే శివకుమార్‌కు దారి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ కోరిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయంపై నేను ఇప్పటికే స్పష్టత ఇచ్చాను. జులై 2న ప్రకటన కూడా చేశాను. ఆ రోజు డీకే శివకుమార్‌ కూడా అక్కడే ఉన్నారు. డీకే శివకుమార్‌ సీఎం కావాలని ఆశపడుతున్నారు. అందులో తప్పు లేదు. అయితే ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే, సీఎం పీఠంపై డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘రెండున్నర సంవత్సరాలు అంటూ ఎప్పుడూ నిర్ణయించలేదు. అది సరైంది కూడా కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉండాలని హైకమాండ్‌ చెప్పింది. వారు ఏం చెప్పినా మేం దాన్ని అనుసరించాలి. నేనూ అదే చేస్తున్నా. డీకే శివకుమార్‌ కూడా దాన్నే అనుసరిస్తారు’ అంటూ సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.

Next Story