అమెరికాలో హైదరాబాద్ వాసిపై దాడి.. మాల్‌లో అందరూ చూస్తుండగానే 15 సార్లు కత్తిపోట్లు!

by Ramesh Naini |

అమెరికాలోని ఉటా (Utah) రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

అమెరికాలో హైదరాబాద్ వాసిపై దాడి.. మాల్‌లో అందరూ చూస్తుండగానే 15 సార్లు కత్తిపోట్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని ఉటా (Utah) రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని టోలీచౌకీకి చెందిన సయ్యద్ సోహైలుద్దీన్ (37) పై ఓ దుండగుడు కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తాను ముస్లిం కావడం వల్లే ఈ దాడి జరిగిందని, నిందితుడు సైతం పోలీసుల విచారణలో ఇదే విషయాన్ని అంగీకరించినట్లు బాధితుడి భార్య అమ్రీన్ ఫిర్దౌస్ తెలిపారు.

ఘటన ఎలా జరిగిందంటే..?

బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 13న ఉటాలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో సోహైల్ పనిచేస్తున్న కియోస్క్ వద్దకు పీటర్ మైఖేల్ లార్సెన్ అనే స్థానిక వ్యక్తి వచ్చాడు. మంచినీళ్ల బాటిల్ అడిగిన అనంతరం, సోహైల్ పేరు, ఏ దేశం నుంచి వచ్చావని ఆరా తీశాడు. తాను భారతీయుడిని అని చెప్పగానే, ఒక్కసారిగా కత్తి తీసి ‘మీ లాంటి వాళ్లకు ఇది జరగాల్సిందే’ అంటూ అత్యంత దారుణంగా పొడిచాడు. సోహైల్ చేతులతో అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా కాలర్ బోన్, వీపు, పక్కటెముకల వద్ద దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. తోటి ఉద్యోగి వాజిద్, అక్కడున్న స్థానికులు జోక్యం చేసుకొని నిందితుడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆసుపత్రిలో విషమంగా సోహైల్ పరిస్థితి..

తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన సోహైల్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చేతులకు, ఇతర భాగాలకు ఇప్పటికే పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. సోహైల్‌కు వైద్య బీమా (Health Insurance) లేకపోవడంతో, ఆసుపత్రి ఖర్చుల కోసం అతని తోటి ఉద్యోగులు ‘GoFundMe’ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. 3 లక్షల డాలర్ల లక్ష్యానికి గానూ, ఇప్పటికే సుమారు 2.41 లక్షల డాలర్లు సమాకురినట్లు తెలుస్తోంది.

అత్యవసర వీసాల కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

సోహైల్ తన భార్య అమ్రీన్, ఇద్దరు పిల్లలతో (5, 3 ఏళ్లు) కలిసి అమెరికాలో ఉంటున్నాడు. ఈ ఘటనతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న సోహైల్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు వెంటనే అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలు మంజూరు చేయాలని, సోహైల్‌కు మెరుగైన వైద్యం అందేలా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ను కుటుంబ సభ్యులు (సోహైల్ వదిన అస్మా ఫిర్దౌస్) కోరారు.

అండగా నిలిచిన అధికారులు

ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ విచారం వ్యక్తం చేసింది. బాధితుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేసింది. ఉటా ఇస్లామిక్ సెంటర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.

Next Story