పెళ్లి పెటాకులు.. దేవుడికి మొక్కులు : విడాకులు వచ్చిన సంతోషంలో 9 కిలోమీటర్ల సాష్టాంగ యాత్ర

by Ramesh Naini |

కోర్టు విడాకులు మంజూరు చేయడంతో గుడికి ఏకంగా 9 కిలోమీటర్ల మేర దండవత్ యాత్ర (నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగడం) చేసి తన మొక్కు చెల్లించుకున్నాడు ఓ భర్త.

పెళ్లి పెటాకులు.. దేవుడికి మొక్కులు : విడాకులు వచ్చిన సంతోషంలో 9 కిలోమీటర్ల సాష్టాంగ యాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా దాంపత్య బంధం కలకాలం నిలవాలని దేవుడికి మొక్కుకుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం తన వివాహ బంధం తెగిపోవాలని దేవుడిని వేడుకున్నాడు. విడాకులు మంజూరైతే ‘దండవత్ యాత్ర’ చేస్తానని వింత మొక్కు మొక్కుకున్నాడు. అన్నట్టుగానే కోర్టు విడాకులు మంజూరు చేయడంతో, నవరాత్రుల పవిత్ర సమయంలో ఏకంగా 9 కిలోమీటర్ల మేర దండవత్ యాత్ర (నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగడం) చేసి తన మొక్కు చెల్లించుకున్నాడు.

వివాదాల వివాహం.. విముక్తి కోసం మొక్కు

బస్తీ జిల్లా సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్ఖోరియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల యోగేష్ (జోగేష్)కు 2022లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి క్రమంగా పెద్దవి కావడంతో యోగేష్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో తన భార్య నుంచి విడాకులు ఇప్పించి, ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదిస్తే.. భన్పూర్ లోని స్థానిక బైదా సమయ్ మాతా (బద్వా మాత) ఆలయానికి దండవత్ యాత్ర చేస్తానని దేవుడికి మొక్కుకున్నాడు.

12 గంటల పాటు కఠిన యాత్ర..

ఈ ఏడాది జనవరిలో కుటుంబ న్యాయస్థానం వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. దీంతో తన మొక్కు తీర్చుకునేందుకు యోగేష్ సిద్ధమయ్యాడు. ఉదయం నుంచి ఎలాంటి అన్నపానీయాలు ముట్టకుండా ఉపవాస దీక్షతో తన 9 కిలోమీటర్ల దండవత్ యాత్రను ప్రారంభించాడు. ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు చేసుకుంటూ.. రాళ్లు, రప్పలు అని చూడకుండా నేల, రోడ్డుపై బోర్లా పడుకుంటూ ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే మోకాళ్లు గీసుకుపోయి రక్తం వస్తున్నా, తీవ్ర అలసటకు గురైనా లెక్కచేయకుండా సుమారు 12 గంటల పాటు ప్రయాణించి సాయంత్రం 6 గంటలకు ఆలయానికి చేరుకున్నాడు. అనంతరం అమ్మవారికి పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి తన ఉపవాసాన్ని విరమించాడు. శారీరకంగా అలిసిపోయినప్పటికీ.. మానసిక ప్రశాంతత లభించిందన్న ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.

పోలీసుల బందోబస్తు నడుమ..

ఈ యాత్ర చేపట్టేందుకు యోగేష్ ముందుగానే స్థానిక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నుంచి అధికారిక అనుమతి తీసుకున్నాడు. అతడి భద్రత కోసం పోలీసులు ఒక కానిస్టేబుల్‌ను కూడా బందోబస్తుగా ఏర్పాటు చేశారు. దారిపొడవునా అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తోడుగా నడిచి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ వింత యాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story