పాక్‌లో ఆకలి కేకలు.. కిలో టమాటా రూ.600

by Muthe.Rajitha |

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే.

పాక్‌లో ఆకలి కేకలు.. కిలో టమాటా రూ.600
X

దిశ, వెబ్ దేశ్ : పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేశారు. దీనివల్ల పాక్-అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. సరిహద్దు మూసివేత వల్ల పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇక ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.

ఒక్క టమాటా ధరలు పాక్‌లో ఐదు రెట్లు పెరిగి ప్రస్తుతం కిలో రూ.600కి చేరుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. దీనిని బట్టి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే అఫ్గాన్ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్ ధరలు కూడా ఎక్కువయ్యాయి. సాధారణంగా ఏటా రూ.2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగే ఈ సరిహద్దులో... ఉద్రిక్తల వల్ల వాణిజ్యం, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ చెప్పారు. దీనివల్ల రోజుకు రూ.8 కోట్ల నష్టం జరుగుతోందని తెలిపారు. అఫ్గాన్ నుంచి పాక్‌కు వచ్చే 5 కంటైనర్ల కూరగాయలు, పండ్లు పాడయ్యాయని తెలిపారు.

సరిహద్దుకు ఇరువైపులా 5,000 కంటైనర్లు నిలిచిపోయాయని సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫైరింగ్ లో సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. అయితే గత వారం దోహాలో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినప్పటికీ.. సరిహద్దులు ఇంకా తెరవలేదు. ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో జరగనున్నాయి. దీని అనంతరం అయినా పాక్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనే నమ్మకం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.

Next Story