మధ్యాహ్న భోజనంలో కలకలం.. ఆస్పత్రి పాలైన వందలాది విద్యార్థులు!

by Ramesh Naini |   (  Updated:2026-05-07 17:17:43  IST  )

పాఠశాలలో వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల వచ్చిన ఘటన బిహార్‌లోని సహర్సా జిల్లాలో కలకలం రేపింది.

మధ్యాహ్న భోజనంలో కలకలం.. ఆస్పత్రి పాలైన వందలాది విద్యార్థులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాలలో వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల వచ్చిన ఘటన బిహార్‌లోని సహర్సా జిల్లాలో కలకలం రేపింది. ఈ విషాహారం తిన్న వందలాది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్‌ పరిధిలో ఉన్న బలువహా మిడిల్‌ స్కూల్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) సరఫరా చేసిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. పిల్లలు భోజనం చేస్తున్న సమయంలో, ఓ విద్యార్థికి వడ్డించిన ప్లేటులో పాము పిల్ల కనిపించింది. అప్పటికే ఆహారం తిన్న చిన్నారులు ఒక్కొక్కరుగా కడుపు నొప్పి, వాంతులతో విలవిలలాడారు.

పదుల సంఖ్యలో విద్యార్థులు

కొద్ది సేపట్లోనే పదుల సంఖ్యలో విద్యార్థులు నొప్పితో అల్లాడిపోవడంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. వెంటనే పోలీసులకు, స్థానిక ఆసుపత్రికి సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అస్వస్థతకు గురైన కొందరు చిన్నారులను తమ వాహనాల్లోనే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం ఆసుపత్రి నుంచి వచ్చిన అంబులెన్స్‌ల ద్వారా మిగిలిన విద్యార్థులను తరలించి చికిత్స అందించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన పలువురు

మెరుగైన వైద్యం కోసం తీవ్ర అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) తీవ్రంగా స్పందించారు. పలు స్థానిక పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసే సదరు ఎన్జీవో క్లస్టర్‌ను తనిఖీ చేసి, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఒక దర్యాప్తు బృందాన్ని అక్కడికి పంపించారు.

Next Story