కుంభమేళాకు భారీగా భక్తులు.. ఇప్పటివరకు ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరించారంటే?

by Yella Dhawani Reddy |

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Kumbh mela) దేశా విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

కుంభమేళాకు భారీగా భక్తులు.. ఇప్పటివరకు ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరించారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Kumbh mela) దేశా విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సామాన్యులు, ప్రముఖులు తరలివచ్చి గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే, 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి మరింతగా పెరిగింది. ఇక మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ యోగి సర్కార్ (UP Yogi Govt) ఓ ప్రకటనలో వెల్లడించింది.

మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని పేర్కొంది. ఇక జనవరి 13న పుష్య పౌర్ణమి రోజు మొదలైన ఈ ఆధ్యాత్మిక వేడుక ఫిబ్రవరి 26 మహా శివరాత్రి రోజు ముగియనుంది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, కేవలం జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు రాగా.. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కుంభమేళాను మరో వారం రోజులు పొడిగిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై యూపీ ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కుంభమేళాను పొడిగించే అవకాశం లేదని, మహా శివరాత్రి రోజుతో ఈ వేడుక ముగియనుందని తెలిపింది.

Next Story