సీఎం విజయ్ సంచలన నిర్ణయం: రైతులు ఫుల్ హ్యాపీ

by Gantepaka Srikanth |

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రైతాంగానికి భారీ ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులకు సహకార రంగంలో ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

సీఎం విజయ్ సంచలన నిర్ణయం: రైతులు ఫుల్ హ్యాపీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రైతాంగానికి భారీ ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులకు సహకార రంగంలో ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం ప్రతి రైతుకు రూ.75,000 వరకు ఉన్న పంట రుణాలను 100 శాతం పూర్తిగా మాఫీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన రూ.50,000 పరిమితిని సవరించి, ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14,43,504 మంది రైతులకు నేరుగా లబ్ది చేకూరనుంది. ఇందులో అత్యధికంగా 8.33 లక్షల మంది సన్నకారు రైతులకు రూ.3,599 కోట్లు, 5.16 లక్షల మంది చిన్నకారు రైతులకు రూ.1.995 కోట్ల మేర రుణ విముక్తి లభించనుంది. మిగిలిన ఇతర కేటగిరీల రైతులకు కూడా నిబంధనల ప్రకారం ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వ ఖజానాపై రూ.5,932 కోట్ల భారం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం విజయ్ ఈ నిర్ణయానికి మొగ్గు చూపారు. ఈ రుణమాఫీ పథకం ద్వారా తమిళనాడు ప్రభుత్వ ఖజానాపై రూ.5,932.23 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది. మే 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 మధ్య కాలంలో సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) స్పష్టం చేసింది. ఒకవేళ రుణం రూ.75,000 కంటే ఎక్కువ ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000 వరకు ఉపశమనం లభిస్తుంది. "రాబోయే సాగు సీజన్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధైర్యంగా కొత్త పంటలు వేసుకునేందుకు, సహకార బ్యాంకుల నుండి నూతన రుణాలు పొందేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది" అని సీఎం విజయ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విపక్షాలు, రైతు సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకునీ, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక ఫైలుపై సంతకం చేశారు.

Next Story