భారీ నకిలీ మొబైల్ విడిభాగాల ముఠా గుట్టురట్టు.. వన్‌ప్లస్, ఒప్పో పేర్లతో భారీ మోసం

by Ramesh Naini |

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన తాజా దాడుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్న భారీ ముఠా గుట్టురట్టయింది.

భారీ నకిలీ మొబైల్ విడిభాగాల ముఠా గుట్టురట్టు.. వన్‌ప్లస్, ఒప్పో పేర్లతో భారీ మోసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మొబైల్ కంపెనీల పేర్లతో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్న ఒక ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ (AGS యూనిట్) పోలీసులు ఛేదించారు. ఒప్పో (OPPO), వన్‌ప్లస్ (OnePlus), రియల్‌మీ (Realme) వంటి బ్రాండ్ల నకిలీ విడిభాగాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. కరోల్ బాగ్, మోతీ నగర్, రామ రోడ్ ఇండస్ట్రియల్ ఏరియాల్లోని గోడౌన్లు, ఫ్యాక్టరీలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బ్రాండింగ్ కోసం ఉపయోగించే 8 యంత్రాలతో పాటు వేల సంఖ్యలో నకిలీ ఇయర్‌బడ్స్, ఇయర్‌ఫోన్లు, అడాప్టర్లు, ప్యాకేజింగ్ బాక్సులను సీజ్ చేశారు.

మోసం సాగిందిలా...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు చైనా నుంచి బ్రాండ్ లేని తక్కువ ధర ఎలక్ట్రానిక్ వస్తువులను బల్క్‌గా దిగుమతి చేసుకునేవారు. ఢిల్లీలోని తమ యూనిట్లలో వాటికి ప్రముఖ బ్రాండ్ల లోగోలు వేసి, నకిలీ బాక్సుల్లో ప్యాక్ చేసి అసలైనవిగా (Original/Duty-free) మార్కెట్లో విక్రయించేవారు. ఈ కేసులో భరత్ రామ్, గౌతమ్ కుమార్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్యాకేజింగ్ మెటీరియల్ సరఫరా చేసే అమిత్ మిశ్రా అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. డీసీపీ హర్ష్ ఇందోరా పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. నిందితులపై బి.ఎన్.ఎస్ (BNS), కాపీరైట్ చట్టం కింద ఎఫ్ఐఆర్ (FIR No. 76/2026) నమోదు చేశారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్, సప్లై చైన్ గురించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story