- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. స్పందించిన ప్రపంచ దేశాలు
పహెల్గాం ఉగ్రదాడి ఘటనకు పాక్ పై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి ఘటనకు పాక్ పై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. బుధవారం అర్ధరాత్రి భారత్ మెరుపుదాడులు చేపట్టింది. కాగా.. దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ ఘటనను వ్యతిరేకిస్తూనే త్వరగా దీనికి ముగింపు పలకాలని కోరారు. ‘‘దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్ పై పోస్టు పెట్టారు. "భారత్, పాక్ మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కారం దిశగా చర్చలు కొనసాగించాలి” అని సూచించారు.
సంయమనం పాటించాలి- చైనా
ఈ దాడులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం తెల్లవారుజామున భారతదేశం తీసుకున్న చర్యను 'విచారకరం' అని అభివర్ణించింది. సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ‘భారత్, పాక్ రెండూ దాయాది దేశాలు. ఇవి రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్, పాకిస్థాన్‌లను కోరుతున్నాం’ అని చైనా కోరింది. ఈ దాడులపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పందిస్తూ.. న్యూఢిల్లీకి మద్దతుని ప్రకటించారు. ‘‘ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సెక్టరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ స్పందిస్తూ.. ఇరుదేశాల సైనికులు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని యూఏఈ ఉప ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అన్నారు. ‘‘భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి’’ అని సూచించారు.






