India: ఫార్మా, సెమీకండక్టర్స్, ఎనర్జీ ఉత్పత్తులపై ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌ మినహాయింపు

by S Gopi |

సుంకాల నిర్ణయంతో ఏర్పడే ప్రపంచ సరఫరా వ్యవస్థ రీ-అలైన్‌మెంట్ భారత్‌కు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని జీటీఆర్ఐ అభిప్రాయపడింది

India: ఫార్మా, సెమీకండక్టర్స్, ఎనర్జీ ఉత్పత్తులపై ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌ మినహాయింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలపై ప్రభావం చూపేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించారు. అయితే, భారత్‌కు సంబంధించి కీలక రంగాలైన ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్స్, రాగి, చమురు, గ్యాస్, బొగ్గు, ఎల్ఎన్‌జీ వంటి ఇంధన ఉత్పత్తులకు మినహాయింపు లభించింది. మొత్తంగా అమెరికా తీసుకున్న సుంకాల నిర్ణయంతో ఏర్పడే ప్రపంచ సరఫరా వ్యవస్థ రీ-అలైన్‌మెంట్ భారత్‌కు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్)జీటీఆర్ఐ) అభిప్రాయపడింది. ఈ అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు భారత్ తన వ్యాపారాలను సులభతరం చేయడం, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడం, విధానాలను స్థిరంగా కొనసాగించాలని సూచించింది. వీటిని అనుసరిస్తే రాబోయే సంవత్సరాల్లో భారత్ కీలక ప్రపంచ తయారీ, ఎగుమతి కేంద్రంగా అవతిస్తుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పటికీ కొన్ని ఉత్పత్తులపై జీరో టారిఫ్ ఉండనుంది. వాటిలో ఔషధాలు, సెమీకండక్టర్లు, చమురు, గ్యాస్, ఇంధనం వంటి ముఖ్యమైన రంగాలున్నాయి.

ప్రధానంగా ఆసియా దేశాలపై అధిక సుంకాలను విధించీ ట్రంప్ ప్రభుత్వం చైనా, వియత్నాం, తైవాన్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌తో సహా అనేక ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగానే ఉంది. ఫలితంగా ప్రపంచ వాణిజ్యం, తయారీ రంగంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం లభిస్తుందని జీటీఆర్ఐ పేర్కొంది. చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, బంగ్లాదేశ్‌పై 37 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతంతో పోలిస్తే, భారతీయ వస్తువులపై 26 శాతం తక్కువ పరస్పర సుంకం రేటును అమెరికా ప్రకటించింది. ప్రధానంగా చైనా, బంగ్లాదేశ్ ఎగుమతులపై అధిక సుంకాలు భారతీయ వస్త్ర తయారీదారులకు మార్కెట్ వాటాను పెంచుకునే ఎక్కువ అవకాశాలను కల్పిస్తాయి. టెక్స్‌టైల్ ఉత్పత్తిలో భారత్ సమర్థవంతంగా రాణించగలదు. తక్కువ సుంకాలతో పాటు, అంతర్జాతీయ డిమాండ్‌ను, ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించవచ్చు.

ఎలక్ట్రానిక్స్, టెలికాం, స్మార్ట్‌ఫోన్ రంగాలలో వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు అమెరికా అధిక సుంకాల కారణంగా పోటీని కోల్పోయే అవకాశం ఉంది. ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన భారత్‌కు ఇది ఒక విండోను తెరుస్తుంది. సెమీకండక్టర్ స్పేస్‌లో తైవాన్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ప్యాకేజింగ్, టెస్టింగ్, లోయర్-ఎండ్ చిప్ తయారీ వంటి వాటిలో అవకాశాలను చేజిక్కించుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని అజయ్ వివరించారు. సుంకాల (32 శాతం) కారణంగా తైవాన్ నుంచి సరఫరా వ్యవస్థలు తాత్కాలికంగా మారినప్పటికీ, తగిన మౌలిక సదుపాయాలు, విధాన మద్దతు ఉంటేనే భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. ఇవి కాకుండా మెషినరీలు, ఆటోమొబైల్స్, టాయ్స్ వంటి రంగాల్లో బలంగా వేళ్లూనుకున్న చైనా, థాయ్‌లాండ్‌లకు అధిక సుంకాలు గట్టి దెబ్బ అనవచ్చు. ఇందులోనూ అవకాశాలు ఉన్నాయని జీటీఆర్ఐ వెల్లడించింది.

Next Story