US-Iran War: తొలిసారి సముద్ర డ్రోన్‌లు వాడిన అమెరికా

by S Gopi |

ఈ మూడు అత్యాధునిక 'కార్సెయిర్' వన్-వే అటాక్ సముద్ర డ్రోన్లు ఇరాన్ పోర్టులోకి దూసుకెళ్లి, అక్కడ ఉన్న జలాంతర్గాములు (సబ్-మెరైన్లు), యుద్ధ నౌకల నిర్వహణ (మెయింటెనెన్స్) కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి.

US-Iran War: తొలిసారి సముద్ర డ్రోన్‌లు వాడిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్లోబల్ డిఫెన్స్ రంగంలో సరికొత్త యుద్ధ విప్లవానికి అమెరికా తెరలేపింది. సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 'సీ డ్రోన్స్'ను నేరుగా యుద్ధ ఆపరేషన్‌లో ఉపయోగించింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక బందర్ అబ్బాస్ నావికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు కార్సెయిర్ సముద్ర డ్రోన్‌లతో ఆదివారం రాత్రి ఈ సంచలన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది. ఈ మూడు అత్యాధునిక 'కార్సెయిర్' వన్-వే అటాక్ సముద్ర డ్రోన్లు ఇరాన్ పోర్టులోకి దూసుకెళ్లి, అక్కడ ఉన్న జలాంతర్గాములు (సబ్-మెరైన్లు), యుద్ధ నౌకల నిర్వహణ (మెయింటెనెన్స్) కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ దాడులకు సంబంధించిన వీడియోను కూడా అమెరికా సైన్యం విడుదల చేసింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఈ నావికా స్థావరం ఇరాన్‌కు అత్యంత కీలకమైన సైనిక కేంద్రాల్లో ఒకటి. వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగించే ఇరాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అమెరికా తెలిపింది. అదే సమయంలో ఇరాన్‌కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ మౌలిక సదుపాయాలు, చిన్న నౌకాదళ యూనిట్లపై కూడా దాడులు జరిపినట్లు పేర్కొంది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామం భవిష్యత్ యుద్ధాల్లో మానవరహిత సాంకేతికత, సముద్ర డ్రోన్‌ల వినియోగం పెరుగుతున్నదానికి కీలక సంకేతంగా మారింది.

Next Story