డిజిటల్ కంటెంట్‌పై కఠిన నియంత్రణ?

by Ajay Maddhiboyina |

ఇలాంటి వివాదాలు భవిష్యత్‌లో ఏర్పడకుండా చట్టాలను మరింత బలోపేతం చేయాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది.

డిజిటల్ కంటెంట్‌పై కఠిన నియంత్రణ?
X

- పరిశీలిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

- ప్యానల్ ముందుకు తీసుకెళ్తానన్న ఎంపీ ప్రియాంక చతుర్వేది

- లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ నరేశ్ మాష్కే

దిశ, నేషనల్ బ్యూరో:

యూట్యూబర్ రన్వీర్ అల్లాబదియా చేసిన జుగుప్సాకరమైన కామెంట్ల నేపథ్యంలో ఇండియాలో డిజిటల్ కంటెంట్‌పై కఠిన నియంత్రణ విధించాలని భావిస్తున్నారు. ఇలాంటి వివాదాలు భవిష్యత్‌లో ఏర్పడకుండా చట్టాలను మరింత బలోపేతం చేయాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. డిజిటల్ కంటెంట్‌కు సంబంధించిన చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేయబోతున్నట్లు పార్లమెంటరీ ప్యానల్ వర్గాలు చెప్పాయి. 'ఇండియా గాట్ లేటెంట్' అనే యూట్యూబ్ షోలో అల్లాబదియా అనే వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్లమెంట్ ప్యానల్ ముందు ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు.

'కామెడీ పేరుతో అసభ్యకరమైన, దైవ దూషణలు చేస్తున్నారు. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్‌పై తప్పకుండా నియంత్రణ అవసరం. లేకపోతే చిన్నారులు,యువకుల మనుసుల్లో మొత్తం చెత్తను నింపేస్తారు. రన్వీర్ అల్లాబదియా ఉపయోగించిన భాషకు కామెడీ షోలోని ఇతర సభ్యులు కూడా మద్దతు పలకడం అంగీకయోగ్యం కాదు. ఈ అంశాలన్నీ నేను ప్యానల్ ముందు లేవనెత్తుతాను' అని ప్రియాంక చతువ్వేది ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు సెన్సార్ లేకపోవడంతో కంటెంట్ క్రియేటర్స్ అలుసుగా తీసుకుంటున్నారని శివసేన ఎంపీ నరేశ్ మాష్కే అన్నారు. ఇలాంటి కంటెంట్ విషయంలో కఠినమైన నిబంధనలు ఉండాలని ఆయన లోక్‌సభలో పేర్కొన్నారు. వాళ్లు మన సంస్కృతి, ఆచారాలను నాశనం చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ఓటీటీలకు సెన్సార్ లేకపోవడమే దీనికి కారణమని నరేశ్ తెలిపారు.

కాగా, ఇండియా గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రుల శృంగారానికి సంబంధించి అల్లాబదియా చేసిన వ్యాఖ్యల క్లిప్స్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. అలాగే ఇండియా గాట్ లేటెంట్‌కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లను దీన్నినిర్వహిస్తున్న సమయ్ రాయ్ తొలగించాడు. కాగా, గురువారం మహారాష్ట్ర సైబర్ సెల్ రెండో సారి అతనికి సమన్లు జారీ చేసింది. అయితే తాను ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నానని.. సమన్లకు స్పందించడానికి మరికొంత సమయం కావాలని కోరాడు.

Next Story