- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనాథాశ్రమంలోని అందమైన అమ్మాయిలతో పెళ్లి చేస్తామంటూ టోకరా.. 42 మంది యువకులు లబోదిబో
అనాథాశ్రమం అమ్మాయిలంటూ మోడల్స్ ఫొటోలు చూపించి సామూహిక వివాహాల పేరుతో 42 కుటుంబాలను లక్షల్లో ముంచేశారు కేటుగాళ్లు.

దిశ, డైనమిక్ బ్యూరో: అనాథాశ్రమంలో ఉన్న అందమైన అమ్మాయిలతో మీ కుమారులకు పెళ్లిళ్లు చేస్తామంటూ నమ్మించిన కేటుగాళ్లు ఏకంగా 42 కుటుంబాలకు కుచ్చుటోపీ పెట్టారు. తాళికట్టేందుకు నేరుగా పెళ్లిపందిట్లోకే రావాలంటూ కబురు పెట్టి అందినకాడికి అమాంతం దోచుకెళ్లారు. తాళి కట్టి తమ భార్యలను ఇంటికి తీసుకు వెళ్దామని ఆశగా వచ్చిన పెళ్లి కొడుకులకు తీవ్ర నిరాశ ఎదురు కాగా ఈ మోసాని చూసి బాధిత కుటుంబాలు నివ్వెరపోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‍లో వెలుగు చూసింది.
అందమైన మోడల్స్ ఫోటోలు చూపి..
పోలీసులు, బాధిత కుటుంబాల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‍లోని ఆయా జిల్లాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు తమ కొడుకులకు సరైన సంబంధాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితిని ఆసరగా చేసుకున్న కొంత మంది కేటుగాళ్లు ఇండోర్‍లోని ఒక అనాథాశ్రమంలో ఉన్న యువతులతో దేవాస్ నగరంలో మే 25న సామూహిక వివాహాలు జరిపించబోతున్నామని నమ్మించారు. వీరిలో మీ కుమారులకు సరైన జోడి వెతుక్కోండి అంటూ సోషల్ మీడియాలో నుంచి డౌన్ లోడ్ చేసిన అందమైన మోడల్స్, అమ్మాయిల ఫోటోలను వారికి చూపించారు. ఆ ఫోటోలను చూసిన తల్లిదండ్రులు తమకు నచ్చిన అమ్మాయిల ఫోటోలను సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఒక్కో వరుడి కుటుంబం నుంచి రూ.12 వేల నుంచి రూ. 25 వేల వరకు ఇలా మొత్తం లక్షల్లో సదరు కేటుగాళ్లు వసూలు చేశారు. మే 25వ తేదీన దేవాస్‍లో జరగబోయే సామూహిక వివాహాలకు పెళ్లి కూతుళ్లను తీసుకువస్తామని మీరంతా నేరుగా 24వ తేదీననే అక్కడికి రావాలని మీకు రాధా గంజ్‍లోని క్లబ్ గ్రౌండ్‍లో వసతి కూడా ఏర్పాటు చేస్తామని ఆ కుటుంబాలకు నమ్మబలికారు.
మండపం లేదు.. పెళ్లికూతుళ్లు లేరు:
ఇన్నాళ్లు సరైన సంబంధాలు దొరకక ఇబ్బంది పడ్డ తమ కుటుంబంలోకి అందమైన అమ్మాయి కోడలుగా రాబోతోందంటూ ఆ 42 కుటుంబాలు ఎంతో సంతోషంతో ఎగిరిగంతేశాయి. నిర్వాకుల మాటలు నమ్మి మే 24వ తేదీ ఉదయమే పెళ్లికొడుకులు, వారి బంధువులు ముస్తాబై దేవాస్‍లోని రాధాగంజ్ క్లబ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి పెళ్లి ఏర్పాట్లు కానీ ఆ వాతావరణమే కాదు కనీసం పెళ్లి కూతుళ్ల జాడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అక్కడ ఉన్న ఆర్గనైజర్లు ముఖేష్ బైరాగి, అతని భార్య సునీతలను బాధితులు నిలదీయగా..ఇండోర్ నుంచి పెళ్లి కూతుళ్లు బయలుదేరారని ఇదిగో వస్తున్నారు.. ఇదిగో అదిగో అంటూ ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కాలయాపన చేశారు. చివరకు రాత్రి వేళ ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు ముఖేష్ బైరాగి, అతని భార్య సునీతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ముఖేష్ అన్న దినేష్ దాస్ బైరాగి (ఇండోర్ నివాసి), ముఖేష్ మామ నరసింగ్ దాస్ బైరాగి కూడా భాగస్వాములుగా ఉన్నట్లు విచారణలో తేలింది. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా విదిశా జిల్లాకు చెందిన వారని, వారి పూర్తి వివరాల కోసం ఒక బృందాన్ని అక్కడికి పంపామని పేర్కొన్నారు. కోడళ్లతో తిరిగి వెళ్లాలనే ఆశతో దేవాస్‌కు చేరుకున్న ఆ 42 కుటుంబాలకు తీవ్ర నిరాశ ఎదురైంది.






