హనీమూన్ మర్డర్ కేసు: సోనమ్‌కు బెయిల్.. షాక్‌లో రాజా రఘువంశీ కుటుంబం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-29 04:21:33  IST  )

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హనీమూన్ హత్యకేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. సోనమ్ జైలు నుంచి విడుదలవ్వడం షాక్ కు గురిచేసింది.

హనీమూన్ మర్డర్ కేసు: సోనమ్‌కు బెయిల్.. షాక్‌లో రాజా రఘువంశీ కుటుంబం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హనీమూన్ హత్యకేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 10 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమె, శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానుంది. గతంలో మూడుసార్లు ఆమె బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించినప్పటికీ, ఈసారి కొన్ని కీలక కారణాలతో బెయిల్ లభించింది.

బెయిల్ లభించడానికి కారణాలివే..

కేసు దర్యాప్తు పూర్తయి, పోలీసులు ఇప్పటికే 790 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. నిందితురాలిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ప్రస్తుతం లేదని, ఆమె దర్యాప్తుకు సహకరిస్తున్నారని సోనమ్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే.. పోలీసులు సోనమ్‌ను అరెస్టు చేసే సమయంలో పత్రాల తయారీలో (Procedural lapses) కొన్ని లోపాలు దొర్లడం కూడా ఆమెకు బెయిల్ రావడానికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఏమిటీ హత్య ఉదంతం?

2025 మే నెలలో సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్ కోసం మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్‌కు వెళ్లారు. అక్కడ సోహ్రాకు చేరుకున్న కొద్దిసేపటికే దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోతైన లోయలో లభించడంతో ఈ అదృశ్యం కేసు హత్య కేసుగా మారింది. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన సోనమ్, నేరాన్ని అంగీకరించినట్లు అప్పట్లో దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

హైకోర్టుకు వెళ్లే యత్నంలో మృతుడి కుటుంబం

సోనమ్‌కు బెయిల్ లభించడంపై రాజా రఘువంశీ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితురాలికి బెయిల్ రావడం అన్యాయమని, తక్షణమే మేఘాలయ హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ను రద్దు చేయించాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారు.

Next Story