Hmpv: అసోంలో10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ పాజిటివ్.. ధ్రువీకరించిన అధికారులు

by B.Srinivas |

హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కేసులు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Hmpv: అసోంలో10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ పాజిటివ్.. ధ్రువీకరించిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. అసోంలో తాజాగా 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజుల క్రితం చలి జ్వరం వంటి లక్ష్యణాలతో బాలిక ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన డాక్టర్లు ఆమె శాంపిల్స్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లేదా (IMCR)కు పంపించగా పాజిటివ్‌గా తేలినట్టు ధ్రువీకరించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చిన్నారి చికిత్స పొందుతోందని డాక్టర్ ధ్రుభజ్యోతి భుయాన్ తెలిపారు. ఇది సాధారణ వైరస్ మాత్రమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

2014 నుంచి దిబ్రూగఢ్ జిల్లాలోని ఐసీఎంఆర్‌లో 110 హెచ్ ఎంపీవీ కేసులను గుర్తించామని, అయితే ఈ సీజన్‌లో ఇదే తొలి కేసు అని ఐసీఎంఆర్ సైంటిస్ట్ డాక్టర్ బిస్వజిత్ బోర్కకోటి తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 15 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 4, మహారాష్ట్రలో 3, కర్ణాటక, తమిళనాడులో 2, యూపీ, రాజస్థాన్, అసోం, బెంగాల్‌లో ఒక్కో కేసు నమోదైంది. హెచ్‌ఎంపీవీ కేసులు పెరగడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వృద్ధులు, పిల్లలు మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశాయి.

Next Story