మావోయిస్టుల డంప్‌‌లపై హైటెక్ నిఘా: ఇస్రో శాటిలైట్లు, GPR టెక్నాలజీతో ‘ఆపరేషన్ ఖజానా’

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-04 09:35:54  IST  )

మావోయిస్టుల అక్రమ వసూళ్లు, ఆయుధాల డంప్‌లను వెలికితీయడమే టార్గెట్‌గా గురిపెడుతూ కేంద్రం ‘ఆపరేషన్ ఖజానా’ను చేపట్టింది.

మావోయిస్టుల డంప్‌‌లపై హైటెక్ నిఘా: ఇస్రో శాటిలైట్లు, GPR టెక్నాలజీతో ‘ఆపరేషన్ ఖజానా’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిజాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. మార్చి 31 నాటికి దేశం నుంచి, ముఖ్యంగా దండకారణ్యం నుంచి మావోయిస్టు పార్టీని ముగించాలని పెట్టుకున్న లక్ష్యం చాలా వరకు విజయవంతమైంది. దండకారణ్యానికి చెందిన మెజారిటీ మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయి ఆయుధాలు అప్పగించగా, మరికొందరు అరెస్ట్ అయ్యారు, ఇంకొందరు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. జార్ఖండ్‌లో మిసిర్ బేస్రా వంటి కొందరు అగ్రనేతలు ఇంకా పట్టుబడనప్పటికీ, మావోయిస్టుల ముప్పును కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించగలిగింది. అయితే, ప్రస్తుతం కేంద్రం ముందున్న తదుపరి సవాలు.. మావోయిస్టుల గుప్త నిధులు, ఆయుధాల రికవరీ అని తెలుస్తోంది.

‘ఆపరేషన్ ఖజానా’కు శ్రీకారం

మావోయిస్టులు ఇప్పటివరకు వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదు, ఆయుధాలు ఇంకా అడవుల్లోనే దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ‘ఆపరేషన్ ఖజానా’ అనే అత్యంత రహస్య, హైటెక్ జాయింట్ ఆపరేషన్‌ను ప్రభుత్వం చేపట్టినట్లు సమాచారం. మావోయిస్టులు భూమి లోపల పూడ్చిపెట్టిన డంప్‌లను, నిధులను వెలికితీసేందుకు ఈసారి సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. అటవీ ప్రాంతాల్లోని భూగర్భ మార్పులను గమనించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాటిలైట్ల సహాయం తీసుకుంటున్నారు. భూమి లోపల నిఘా పెట్టగల అత్యాధునిక రడార్ల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. ఆకాశం నుంచి డ్రోన్ల ద్వారా అడవుల్లో థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. డీప్ మెటల్ డిటెక్టర్లు, బాంబ్ స్క్వాడ్ (BDS) బృందాలతో క్షేత్రస్థాయిలో జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు.

నోట్ల రద్దు ఎఫెక్ట్.. బంగారు బిస్కెట్లుగా వసూళ్ల సొమ్ము

కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు మావోయిస్టులకు పెద్ద దెబ్బగా మారింది. ఆ ఆకస్మిక పరిణామాన్ని తట్టుకోవడానికి వారు ఓ కొత్త ఉపాయం ఆలోచించారు. తమ వద్ద ఉన్న కోట్ల రూపాయల నగదును బంగారు బిస్కెట్లుగా మార్చి, వాటిని ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టి భూమిలో పాతిపెట్టారు. బంగారం ధర నిరంతరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి, తమ సంపద సురక్షితంగా ఉంటుందని వారు భావించారు. ఇటీవల లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు బీజాపూర్ పరిసర ప్రాంతాల నుంచే సుమారు రూ.20 కోట్ల విలువైన నగదు, బంగారు బిస్కెట్లను రికవరీ చేశారు.

ఏటా రూ.82 కోట్ల వసూళ్లు..

భద్రతా దళాల అత్యంత నమ్మకమైన, రహస్య నివేదికల ప్రకారం.. కేవలం బస్తర్ డివిజన్‌లోని సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, కొండగావ్, కాంకేర్, బస్తర్, రాజ్‌నంద్‌గావ్, కబీర్‌ధామ్ జిల్లాల నుంచే మావోయిస్టులు ఏడాదికి సుమారు రూ.82 కోట్ల రూపాయల లెవీ వసూలు చేసేవారు. అటవీ ప్రాంతాల్లోని ధనిక, సగటు గ్రామీణ కుటుంబాలు, బస్సులు, ట్రక్కుల రవాణాదారులు, బీడీ ఆకులు, వెదురు (Bamboo) సేకరించే కూలీలు, వాటిని నిల్వ చేసే స్టోరేజ్ యజమానుల నుంచి ఈ డబ్బు వసూలు చేసేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలు, లోకల్ మార్కెట్లలోని కిరాణా దుకాణాలు, వ్యాపారస్తుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడేవారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కూడా వసూలు చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.

భవిష్యత్తులో అవకాశం ఇవ్వకుండా..

మావోయిస్టులు తాము వసూలు చేసే మొత్తంలో దాదాపు 50 శాతం నిధులను, అధునాతన ఆయుధాలను భూగర్భంలోనే దాచి ఉంచుతారని స్పష్టమైంది. ప్రస్తుతం లొంగిపోతున్న మావోయిస్టులలో కొందరు భయంతో వస్తుంటే, మరికొందరు వ్యూహాత్మకంగా బయటకు వస్తున్నారని, వీరు ఈ డంప్‌ల గురించిన పూర్తి సమాచారాన్ని దాస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. భూమి అడుగున ఇంకా రూ.200 కోట్లకు పైగా నగదు, మందుపాతరలు ఉన్నట్లు అంచనా. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించినప్పుడు, ఈ నిధులు, ఆయుధాల సహాయంతో మావోయిస్టులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. అందుకే, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా, అడవుల్లో దాగి ఉన్న ప్రతి పైసను, ఆయుధాన్ని ప్రభుత్వ ఖజానాకు చేర్చడమే లక్ష్యంగా ఈ హైటెక్ వేట కొనసాగుతోంది.

Next Story