ఆగ్రా రైల్వే స్టేషన్‌లో హైడ్రామా..! అధికారిని ఈడ్చుకెళ్లిన ఆర్పీఎఫ్ సిబ్బంది వైరల్

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఆగ్రా రైల్వే స్టేషన్‌లో హైడ్రామా..! అధికారిని ఈడ్చుకెళ్లిన ఆర్పీఎఫ్ సిబ్బంది వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కాంట్ (Agra Cantt) రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైలును ఆపిన డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్‌ (Dy SS)పై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది వాగ్వాదానికి దిగారు. అందరూ చూస్తుండగానే ఆయన కాళ్లు, చేతులు పట్టుకుని దారుణంగా ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది.

అసలేం జరిగిందంటే..?

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అమృత్‌సర్ - విశాఖపట్నం హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) ఉదయం 10:51 గంటలకు ఆగ్రా కాంట్ స్టేషన్‌కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం తిరిగి బయలుదేరుతుండగా, ఓ మహిళ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రమాదాన్ని పసిగట్టిన డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ వెంటనే స్పందించి, వాకీటాకీ ద్వారా రైలు మేనేజర్‌ను అప్రమత్తం చేసి రైలును ఆపించినట్లు అధికారి చెప్పుకొచ్చారు.

ఆర్పీఎఫ్ అత్యుత్సాహం..

రైలు ఆగడాన్ని చైన్ పుల్లింగ్ (ACP)గా అపార్థం చేసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది.. ఓ భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. ఆర్పీఎఫ్ సిబ్బంది ఆయనతో వాగ్వాదానికి దిగారు. వివాదం ముదరడంతో నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు అధికారిని అత్యంత అవమానకరంగా స్టేషన్‌లో ఈడ్చుకెళ్లారు. వీడియోలు వైరల్ కావడం, రైల్వే ఆపరేటింగ్ సిబ్బంది నిరసనలకు దిగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) సీపీఆర్వో శివమ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఏఎస్ఐలు మేఘరాజ్ మీనా, బాలకిషన్, కానిస్టేబుళ్లు జితేంద్ర, బదన్ సింగ్‌లను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశారు.

త్రిసభ్య కమిటీ విచారణ

ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ (AOM), అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ (ASC), అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ADEE)లతో కూడిన త్రిసభ్య కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. నివేదిక అందిన తర్వాత రైల్వే చట్టం ప్రకారం బాధ్యులపై తదుపరి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Next Story