- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: వారికి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వండి.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
కులం లేదా మతం ద్వారా గుర్తించబడటానికి ఇష్టపడని వ్యక్తులకు నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

దిశ, నేషనల్ బ్యూరో: కులం, మతం ద్వారా గుర్తింపు పొందడానికి ఇష్టపడని వ్యక్తులకు నో క్యాస్ట్ నో రిలీజియన్ (No caste no Religion) సర్టిఫికెట్లు మంజూరు చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High court) తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను రెవెన్యూ అధికారులకు ఆర్డర్స్ ఇవ్వాలని తెలిపింది. తన కుటుంబానికి ఈ తరహా సర్టిఫికెట్ జారీ చేయాలని తిరుపత్తూరు జిల్లాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి గతంలో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు పిల్లలు ఉన్న సంతోష్ తాను కులం లేదా మతం ఆధారంగా ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేదని, భవిష్యత్తులో అలా చేయాలనే ఉద్దేశం కూడా లేదని పేర్కొన్నాడు. కులం, మతపరమైన గుర్తింపు లేని సమాజంలో తన పిల్లలను పెంచాలనే కోరికను వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ నెలలోపు పిటిషనర్ కు సర్టిఫికెట్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్, సంబంధిత తహశీల్దార్‌ను ఆదేశించింది.
అలాగే రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అటువంటి సర్టిఫికెట్లు జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. భారత రాజ్యాంగం కుల ఆధారిత వివక్షను నిషేధించినప్పటికీ, రిజర్వేషన్ విధానాల ద్వారా సామాజిక జీవితం, రాజకీయాలు, విద్య, ఉపాధిలో కులం, మతం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. కుల, మతపరమైన గుర్తింపును విడిచిపెట్టాలన్ని పిటిషనర్ నిర్ణయాన్ని ప్రశంసించింది. అలాంటి ప్రయత్నాలు కుల ఆధారిత వివక్ష నిషేధాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయని తెలిపింది.






