BREAKING: గణేష్ నిమజ్జనాల వేళ పోలీసులకు ఉగ్రవాదుల హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్

by Naga Rani Yarlagadda |

ముంబైలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో 34 వాహనాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్టులు నిర్వహిస్తామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన మెసేజ్ తో అప్రమత్తమయ్యారు.

BREAKING: గణేష్ నిమజ్జనాల వేళ పోలీసులకు ఉగ్రవాదుల హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబైలో పోలీసులు (Mumbai Police) భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలర్ట్ (High Alert) ప్రకటించారు. నగర ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్ కు ఉగ్రవాదులు పంపిన వార్నింగ్ మెసేజే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో 34 వాహనాల్లో మానవబాంబులను అమర్చామని, 400 కేజీల ఆర్డీఎక్స్ ను పేల్చితే కోటి మంది మరణిస్తారని, ఈ పేలుళ్లు నగరం మొత్తాన్ని భయాందోళనలకు గురిచేయడం ఖాయమని ఆ మెసేజ్ లో ఉగ్రవాదులు పేర్కొన్నారు. లష్కర్-ఎ-జిహాదీ (Lashkar-e-Jihadi) నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ పేలుళ్లు జరిపేందుకు భారత్ లోకి ప్రవేశించారని కూడా సదరు ఉగ్రవాద సంస్థ తెలిపింది.

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై పెట్టింది పేరు. అక్కడ గణేష్ నిమజ్జనానికి భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా..ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఉగ్రవాద నిరోధక దళం (Anti Terrorism Squad), ఇతర సంస్థలకు దీనిపై సమాచారం ఇచ్చామన్నారు. గణేష్ నిమజ్జన వేడుకలను చూసేందుకు లక్షలాదిమంది భక్తులు రానున్న క్రమంలో ఉగ్రవాదుల బెదిరింపు మెసేజ్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని సూచించారు.

Next Story