- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న భారీగా మంచు వర్షం.. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పలు చోట్ల భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పలు చోట్ల భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జమ్మూ ప్రాంతంలోని ఉన్నత ప్రాంతాలతో పాటు మాతా వైష్ణో దేవి ఆలయ పరిసరాల్లో కూడా మంచు కురవడంతో కీలక రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విమాన, రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం గురువారం రాత్రి నుంచి బలమైన గాలులతో పాటు ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభమైంది. జమ్మూ నగరం సహా మైదాన ప్రాంతాల్లో అంతరాయంగా వర్షాలు కురిశాయి. రంబన్, డోడా, కిష్త్వార్, పూంచ్, రాజౌరి, రియాసి, ఉదంపూర్, కథువా జిల్లాల ఎగువ ప్రాంతాల్లో మంచు వర్షం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
శ్రీ మాతా వైష్ణో దేవి భవన్..
శ్రీ మాతా వైష్ణో దేవి భవన్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా మంచు కురిసినట్లు ఆలయ బోర్డు ‘ఎక్స్’ (X) వేదికగా వెల్లడించింది. భక్తులు దివ్యమైన వాతావరణాన్ని ఆస్వాదించారని పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా తారకోటే, బంగంగా మార్గాల నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి, అనంతరం తిరిగి ప్రారంభించారు. కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై నవయుగ్ టన్నెల్ (బనిహాల్–ఖాజిగుండ్) ప్రాంతంలో మంచు పేరుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఘల్ రోడ్, శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి, సింథన్ రోడ్లు కూడా మూసివేయబడ్డాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.
పాఠశాలల మూసివేత
భారీ మంచు వర్షం కారణంగా రైల్వే సేవలు కూడా పాక్షికంగా ప్రభావితమయ్యాయి. వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ సేవల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలో ఐదు విమానాలు రద్దుకాగా, మరికొన్ని ఆలస్యమయ్యాయి. ఈ రోజు మొత్తం 32 విమానాలు రాకపోకలకు షెడ్యూల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచు వర్షం నేపథ్యంలో రాజౌరి, పూంచ్, కథువా జిల్లాల్లోని పర్వత ప్రాంతాల పాఠశాలలను ముందస్తు జాగ్రత్త చర్యగా మూసివేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.






