Heavy Rains Mumbai : ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ

by Ramesh Naini |

మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.

Heavy Rains Mumbai : ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, పాల్ఘర్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. థానే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వరద నీరు రోడ్లపైకీ భారీగా చేరడంతో బుధవారం ఉదయం ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

స్తంభించిన అంధేరీ సబ్‌వే..

భారీగా చేరిన వరద నీటి కారణంగా ముంబైలోని కీలకమైన అంధేరీ సబ్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదాలను నివారించడానికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది అక్కడ నిరంతరం పహారా కాస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వరద నీటిలోకి దూసుకెళ్లిన ఒక ఆటో రిక్షా మధ్యలో చిక్కుకుపోగా, BMC అధికారులు సమయస్ఫూర్తితో స్పందించి డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పూడుకుపోవడం వల్లే నీరు నిలిచిపోతోందని, కాలేజీలకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనసాగుతున్న లోకల్ రైళ్లు..

నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పశ్చిమ శివారు ప్రాంతాలైన కండివలి, మలాడ్, శాంటాక్రూజ్ పరిసరాల్లో గంట వ్యవధిలోనే భారీ వర్షం కురిసింది. అయితే, పట్టాలపై నీరు చేరినప్పటికీ సబర్బన్ లోకల్ రైలు సేవలు ప్రస్తుతానికి సాధారణంగానే నడుస్తున్నట్లు వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. హార్బర్ లైన్, చర్చ్ గేట్-దహాను కారిడార్లలో రద్దీ సమయాల్లోనూ రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. పశ్చిమ తీరంలో రానున్న గంటల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Next Story