- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వరదలు.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన చక్కెర
ఉత్తర భారతదేశంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా (Haryana) రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్‌లో ఒకటైన యమునానగర్‌లోని ప్రసిద్ధ సరస్వతి షుగర్ మిల్లులో (Saraswati Sugar Mill) భారీ నష్టం సంభవించింది. వరదనీరు మిల్లులోకి ప్రవేశించి, అక్కడ నిల్వ ఉంచిన లక్షల క్వింటాళ్ల పంచదారను తడిపేసింది. మిల్లులో మొత్తం రూ.97 కోట్ల విలువ గల 2.20 లక్షల క్వింటాళ్ల పంచదారను నిర్వాహకులు నిల్వ ఉంచారు. అయితే వరద నీటి ప్రభావంతో దాదాపు 1.20 లక్షల క్వింటాళ్ల పంచదార తడిసి, కరిగిపోయింది. దీనివల్ల రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య నష్టం వాటిల్లింది.
ఇక ఈ ఘటనపై సరస్వతి చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ 'నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి సమయంలో మిల్ ఆవరణలోకి వరద ప్రవేశిస్తోందని సిబ్బంది మమ్మల్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ డ్రెయిన్ మిల్లు వెనుక నుంచే వెళుతుంది. ఆక్రమణ కారణంగా డ్రెయిన్ మూసుకుపోయి.. వరద నీరంతా మిల్లులోకి చేరింది. దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువైన చక్కెర కరిగిపోయింది. అయితే, నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. మిల్లు మొత్తం తనిఖీ చేసిన తర్వాత నష్టంపై ఓ అంచనాకు రావొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో వర్షాలు తీవ్రమవుతున్న సమయంలో, యమునానగర్ జిల్లా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే వరద నీరు ఈ షుగర్ మిల్‌లోకి ప్రవేశించింది.






