S Jaishankar: బిల్లు ఆమోదిస్తే చూద్దాం: విదేశాంగ మంత్రి జైశంకర్

by S Gopi |

బిల్లును సమర్థించిన అమెరికా సెనేటర్‌తో భారత్ ఇప్పటికే ఇంధన భద్రతపై తన ఆందోళనలను పంచుకుందని అన్నారు.

S Jaishankar: బిల్లు ఆమోదిస్తే చూద్దాం: విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం చేసే క్రమంలో ఆ దేశం నుంచి చమురు కొనే దేశాలపై భారీగా సుంకాలు విధించేందుకు అమెరికా ప్రత్యేక బిల్లును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా సెనేటర్‌ లిండ్సీ గ్రహమ్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ బిల్లు ప్రధానంగా 70 శాతం రష్యా ముడిచమురును కొంటున్న భారత్, చైనాపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం సుంకాలను ప్రతిపాదించే బిల్లును సమర్థించిన అమెరికా సెనేటర్‌తో భారత్ ఇప్పటికే ఇంధన భద్రతపై తన ఆందోళనలను పంచుకుందని అన్నారు. క్వాడ్ సమ్మిట్‌ కోసం నాలుగు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, 'రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే భారత్‌కు ఈ బిల్లు వల్ల కలిగే చిక్కుల గురించి తెలుసునని' అన్నారు.

వాషింగ్టన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. 'అమెరికా కాంగ్రెస్‌లో భారత్‌కు ఆసక్తి ఉన్న లేదా దానిపై ప్రభావం చూపే పరిణామాలను ఎల్లప్పుడూ నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత రాయబార కార్యాలయంతో పాటు అధికారులు బిల్లును స్పాన్సర్ చేసిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంధన భద్రతకు సంబంధించి భారత్‌కు ఉన్న ఆందోళనలు వారికి తెలుసని నేను భావిస్తున్నాను. కాబట్టి, ఈ విషయంలో బిల్లు మనదాక వచ్చినప్పుడు చూద్దాం. ముందుగానే దాని గురించి ఆలోచించడం కంటే, ఆ సమయం వచ్చాక చర్చిద్దామని' అని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

భారత్, చైనాతో సహా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాల నుంచి దిగుమతులపై 500 శాతం సుంకాన్ని విధించే కొత్త ఆంక్షల బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇవ్వడం మనదేశానికి సంక్లిష్టంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా చర్చలు జరపడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ బిల్లును చూస్తున్నారు.

భారత్‌పై ప్రభావం

ఈ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో భారత దిగుమతులు 500 శాతం భారీ సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, ఏప్రిల్‌లో ట్రంప్ ప్రకటించిన 26 శాతం పరస్పర సుంకాన్ని నివారించడానికే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చేరువవుతున్న వేళ ఈ పరిణామం కొంత ఇబ్బందికరమని చెప్పాలి. రష్యా నుంచి భారత్ కొంటున్న ముడిచమురు దిగుమతులో మన ఇంధన అవసరాల్లో 40-45 శాతం వాటా కలిగి ఉన్నాయి. మే నెలలో రష్యా చమురు దిగుమతులు 10 నెలల గరిష్ట స్థాయికి (రోజుకు 19.6 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఇది పశ్చిమాసియా సరఫరాదారుల కంటే ఎక్కువ.

Next Story