Delhi: 15 ఏళ్లు పైబడిన వాహనాలకు నో ఫ్యుయల్- ఢిల్లీ ప్రభుత్వం

by Shamantha N |

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కాలుష్య నివారణ కట్టడికి అక్కడి ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది.

Delhi: 15 ఏళ్లు పైబడిన వాహనాలకు నో ఫ్యుయల్- ఢిల్లీ ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కాలుష్య నివారణ కట్టడికి అక్కడి ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాతే మంత్రి నుంచి ఈ ప్రకటన వెలువడింది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్‌ బంకుల వద్ద గ్యాడ్జెట్‌లు ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్లు పైబడిన వాహనాలను అవి గుర్తిస్తాయి. దాంతో వాటికి ఫ్యూయల్ అందదు’’ అని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా, టవర్స్, పెద్ద బిల్డింగ్ లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోగ్‌ గన్లను అమర్చాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశలవారీగా ఉపసంహరిస్తామన్నారు. ఆ స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఢిల్లీ వాయు కాలుష్యం

ప్రతి ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. వాయునాణ్యత క్షీణిస్తోంది. ఏక్యూఐ 500కి పైగా నమోదవుతోంది. అయితే, వాయుకాలుషఅయాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలు చేపడుతున్నాయి కానీ.. శాశ్వత చర్యలపై దృష్టి సారించట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారింది. కాలుష్య కట్టడికి ఆప్ చర్యలు తీసుకోలేదని బీజేపీ విమర్శించింది. కాగా.. ప్రస్తుతం అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా, కేంద్రం తెచ్చిన తుక్కు విధానాన్ని సమర్థంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. దీంతో, ఫిట్ నెస్ లేని వాహనాల వాడకపోవడంతో కాలుష్యం తగ్గనుంది.

Next Story