Haribhushan: హోలీ రోజు ముస్లింలు ఇంటికే పరిమితం కావాలి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

by B.Srinivas |

బిహార్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోలీ నాడు ముస్లింలు ఇంటికే పరిమితం కావాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు.

Haribhushan: హోలీ రోజు ముస్లింలు ఇంటికే పరిమితం కావాలి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ ( Haribhushan Thakur Bachaul) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోలీ నాడు ముస్లింలు ఇంటికే పరిమితం కావాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. బిహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం ప్రార్థనలు ఏడాదికి 52 రోజులు జరుగుతాయి. కానీ హోలీ మాత్రం సంవత్సరానికి ఒకసారే వస్తుంది. కాబట్టి ఆరోజున ముస్లిం సమాజం బయటకు రాకపోతే మంచిది. ఒకవేళ బయటకు వచ్చినప్పుడు ఎవరైనా వారి మీద రంగు పోస్తే దానిని తప్పుగా అర్థం చేసుకునే చాన్స్ ఉంది. దాని వల్ల పర్యావరణం సైతం పాడుకావొచ్చు’ అని వ్యాఖ్యానించారు. రంగులు పూస్తే ఎవరూ బాధపడకూడదని, అటువంటి వారు ఇంటి లోపలే ఉండాలని తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.

హరిభూషణ్ వ్యాఖ్యలపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఘాటుగా స్పందించారు. ‘హోలీ రోజు ముస్లింలు బయటకు రావొద్దని చెప్పారు. ఈ విషయం చెప్పడానికి హరిభూషణ్ ఎవరు. ఈ రాష్ట్రం ఏమైనా వాళ్ల డాడీదా’ అని ప్రశ్నించారు. బచోల్‌పై చర్యలు తీసుకునే ధైర్యం సీఎం నితీశ్ కుమార్‌కు ఉందా అని నిలదీశారు. ఇది బిహార్ అని రామ్, రహీమ్ లను నమ్మే ప్రాంతమని నొక్కి చెప్పారు. బిహార్‌లో ఆరుగురు హిందువులు కలిసి ముస్లిం సోదరుడిని రక్షిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని బచౌల్ అర్థం చేసుకోవాలని తెలిపారు. ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ఎల్లప్పుడూ భారతీయ సామరస్యాన్ని చెడగొడుతూనే ఉన్నారని విమర్శించారు. దేశాన్ని విభజించి ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

Next Story