Hamas: ఇజ్రాయెల్ బందీల విడుదలకు బ్రేక్.. కాల్పుల విరమణ వేళ కీలక పరిణామం

by vinod kumar |
Hamas: ఇజ్రాయెల్ బందీల విడుదలకు బ్రేక్.. కాల్పుల విరమణ వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ (Israel- Hamas) మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ డీల్‌ను ఉల్లంఘించిందని హమాస్ ఆరోపించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడాన్ని నిలిపివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. శనివారం జరగాల్సిన బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ ప్రతినిధి అబూ ఉబైదా తెలిపారు. జనవరి 19న కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తర గాజాకు స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లను తిరిగి పంపడంలో ఇజ్రాయెల్ ఆలస్యం చేసిందని, గాజా ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు కొనసాగించిందని తెలిపారు. అంతేగాక ఈ ప్రాంతంలోకి సహాయ సామగ్రి ప్రవేశాన్ని అడ్డుకుందని పేర్కొన్నారు. గత మూడు వారాలుగా కాల్పుల విరమణ కొనసాగినప్పటికీ, ఇజ్రాయెల్ కాల్పుల్లో పాలస్తీనియన్లు మరణించిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటిపై ఇజ్రాయెల్ స్పందించే వరకు బందీల విడుదలను నిలిపి వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ స్పందించారు. బందీలను విడుదల చేయడాన్ని నిలిపివేయాలని హమాస్ తీసుకున్న నిర్ణయం గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్నారు. కాల్పుల విరమణలో భాగంగా ఇప్పటి వరకు హమాస్ 21 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ 730 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసింది. తదుపరి విడుదల శనివారం జరగనుండగా ఈ నేపథ్యంలోనే హమాస్ పై ప్రకటన చేసింది.

Next Story

Most Viewed