భారత్‌లో ఇరుక్కుపోయిన హెచ్1బీ వీసాదారులు!

by Phanindra |

భారత్‌లో హెచ్1బీ వీసాదారులు ఇరుక్కుపోయారు. రిన్యూవల్ ఇంటర్వ్యూలను సడెన్‌గా యూఎస్ కాన్సులర్ ఆఫీసులు క్యాన్సిల్ చేయడంతోనే ఇలా జరిగింది.

భారత్‌లో ఇరుక్కుపోయిన హెచ్1బీ వీసాదారులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ తీసుకున్న అర్ధంతరపు నిర్ణయంతో వేలాది మంది హెచ్1బీ వీసాదారులు భారత్‌లో ఇరుక్కుపోయారు. వీసా రిన్యూ చేసుకోవడానికి స్వదేశం వచ్చిన వీరు.. వీసా ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంది. అయితే వీరి ఇంటర్వ్యూలను ఎలాంటి నోటీసు లేకుండా అర్ధంతరంగా వాయిదా వేసిన యూఎస్ కాన్సులర్ ఆఫీసులు.. నెలల తర్వాతే మళ్లీ కొత్త డేట్స్ ఇచ్చాయి. ఈ క్రమంలో గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వద్ద యూఎస్‌లో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులు స్వదేశాలకే కాదు.. ఏ దేశానికి వెళ్లొద్దని నోటీసులు పంపాయి. ఒకవేళ వెళ్తే అక్కడ ఎక్కువ కాలం ఉండిపోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

యూఎస్ కాన్సులర్ ఆఫీసుల ఈ నిర్ణయం వెనుక ట్రంప్ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘సోషల్ మీడియా దర్యాప్తు’ అంశమే కారణంగా కనిపిస్తోంది. యూఎస్ వీసా కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా.. వారి సోషల్ మీడియా మొత్తాన్ని జల్లెడపట్టి, వారు ఎప్పుడైనా అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారా? అని వెతకాలని ట్రంప్ సర్కారు ఆదేశించింది. అలాంటి పోస్టులు పెట్టిన వారికి దేశ భద్రత దృష్ట్యా వీసాలు ఇవ్వొద్దనేది ఆ ఆదేశాల సారాంశం. దీంతో ఈ ప్రక్రియను చేపట్టిన యూఎస్ కాన్సులర్ ఆఫీసులు.. హెచ్1బీ రిన్యూవల్ కోసం వచ్చిన సోషల్ మీడియాలు దర్యాప్తు చేయడం కోసమే వారి ఇంటర్వ్యూలు క్యాన్సిల్ చేసి, కొన్ని నెలల తర్వాతకు రీషెడ్యూల్ చేసినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఇదంతా చూసిన ఇమిగ్రేషన్ లాయర్లు.. యూఎస్ చరిత్రలోనే అత్యంత గందరగోళ పరిస్థితి ఇదేనంటూ మండిపడుతున్నారు. ఈ విషయంలో అసలు ట్రంప్ ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. భారత్‌లో ఉండిపోయిన టెకీలు కూడా టెన్షన్‌లో పడిపోయారు. యూఎస్‌లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తాము స్వదేశంలోనే ఇరుక్కుపోయామని ఆందోళన చెందుతున్నారు.

Next Story