మానవతా సమస్యలు సృష్టిస్తుంది.. హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై భారత్ రియాక్షన్

by Phanindra |

హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ నిర్ణయం మానవతా సమస్యలు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది.

మానవతా సమస్యలు సృష్టిస్తుంది.. హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై భారత్ రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్1బీ వీసా ఫీజులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమాంతం పెంచేయడం మానవతా సమస్యలు సృష్టిస్తుందని, వీసాదారుల కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది. యూఎస్ నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తున్నామన్న కేంద్రం.. ఈ సమస్యలను పరిష్కరించాలని అమెరికా అధికారులను కోరింది. ‘కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా తాజా నిబంధనలు మానవతా సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ సమస్యలను యూఎస్ ప్రభుత్వం సరిగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం’ అని భారత విదేశాంగ శాఖ శనివారం నాడు తెలిపింది.

హెచ్1బీ వీసా ఫీజులు పెంచడం వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేస్తున్నామని, కొన్ని భారత పరిశ్రమలు ఇప్పటికే ప్రాథమికంగా విశ్లేషించి కొంత స్పష్టతనిచ్చాయని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, యూఎస్ రెండు దేశాల్లో ఆవిష్కరణలు, సృజనాత్మక రంగాలపై దీని ప్రభావం ఉండొచ్చని, కాబట్టి ఈ అంశాలపై ఒక నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే ఇరుదేశాల్లోని పరిశ్రమల మధ్య చర్చలు జరగొచ్చని అభిప్రాయపడింది. యూఎస్, భారత్ రెండు దేశాల అభివృద్ధిలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, ఈ నేపథ్యంలో తాజా నిబంధనలపై ఇరుదేశాలకు లాభం చేకూరేలా చర్యలుంటాయని పేర్కొంది.

Next Story