- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gyanesh Kumar: నూతన సీఈసీగా జ్ఞానేష్ కుమార్.. ప్రకటించిన కేంద్రం
తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేష్ కుమార్ నియామకమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేష్ కుమార్ (Gnanesh kumar) నియామకమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సీఈసీ సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం మంగళవారం ముగియనుండగా ఆయన స్థానంలో జ్ఞానేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే వివేక్ జోషి ఎన్నికల కమిషనర్‌గా నియామకమయ్యారు. అయితే గతేడాది సీఈసీ, ఈసీల నియామకాలపై కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఈ చట్టం ప్రకారం ఎన్నికైన తొలి సీఈసీగా జ్ఞానేష్ ఘనత సాధించారు. ఆయన 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగనున్నారు.
కాంగ్రెస్ అభ్యంతరం
సీఈసీగా జ్ఞానేష్ కుమార్‌ను ప్రకటించడానికి ముందు ప్రధాని మోడీ నేతృత్వంలో కమిటీ భేటీ అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కొత్త చట్టంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున నూతన సీఈసీ ఎంపికను వాయిదా వేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. సీఈసీగా ఎంపిక జరిగితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తొలగించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, అభిషేక్ మనుసింఘ్వీలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ పేరును అధికారికంగా ప్రకటించింది.
ఎవరీ జ్ఞానేష్ కుమార్?
జ్ఞానేష్ కేరళకు చెందిన1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కీలక శాఖలను పర్యవేక్షించారు. 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు ముసాయిదా బిల్లుని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కశ్మీర్ డివిజన్‌ను ఆయన పర్యవేక్షించారు. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా అయోధ్యలోని రామమందిరంకు సంబంధించిన పత్రాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఈసీగా విధులు నిర్వహిస్తు్న్నారు.






