Gujarat: గుజరాత్‌లో భారీ వర్షాలు.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

by B.Srinivas |

తుపాన్, బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇండ్లు, చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి.

Gujarat: గుజరాత్‌లో భారీ వర్షాలు.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌ (Gujarath)లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తుపాన్, బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇండ్లు, చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. దీంతో పలు ఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు వెల్లడించారు. 253 తాలూకాల్లో 168 చోట్ల అకాల వర్షాలు కురిశాయని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (SEOC) తెలిపింది. ఖేడా, గాంధీనగర్, మెహసానా, వడోదర జిల్లాల్లో 25 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బలమైన గాలుల కారణంగా చెట్లు, హోర్డింగులు, స్తంభాలు నేలకొరగడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.

అయితే మరికొన్ని రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు, తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ టైంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. బనస్కాంత, కచ్, సబర్కాంత, ఆరావళి, ఆనంద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.

Next Story