జీఎస్టీలో 12 శాతం శ్లాబు తొలగింపు?.. ఈ నెలాఖరులోపు నిర్ణయం పక్కా?

by Phanindra |

జీఎస్టీలో 12 శాతం శ్లాబు తొలగించే దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నెలాఖరులోపు దీనిపై నిర్ణయం తీసుకోవడం పక్కా?

జీఎస్టీలో 12 శాతం శ్లాబు తొలగింపు?.. ఈ నెలాఖరులోపు నిర్ణయం పక్కా?
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మధ్య, పేద తరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ జీవితంలో ఉపయోగించే పలు వస్తువులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని, లేదంటే అసలు జీఎస్టీలో 12 శాతం శ్లాబును పూర్తిగా తొలగించేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులన్నీ కూడా సామాన్యులు రోజువారీ జీవితంలో ఉపయోగించేవే కావడం గమనార్హం.

అందుకే ఈ వస్తువులను 5 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో చేర్చాలని, తద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించాలని కౌన్సిల్ ఆలోచిస్తోందట. లేదంటే పూర్తిగా 12 శాతం శ్లాబును తొలగించేసి, దాంట్లోని వస్తువులను మిగతా శ్లాబుల్లో సర్దేసే ఆలోచన కూడా ఉందట. త్వరలో జరిగే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశం నిర్వహించాలంటే 15 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ నెలాఖరులో సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చాలా కీలకంగా మారనుంది.

Next Story