Elon Musk: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. మరో సంచలనానికి తెర లేపిన ఎలాన్ మస్క్

by Prasad Jukanti |   (  Updated:2025-10-06 12:12:53  IST  )

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు.

Elon Musk: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. మరో సంచలనానికి తెర లేపిన ఎలాన్ మస్క్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విభిన్న ఆవిష్కరణలు, పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్‍గా నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశారు. మస్క్ కు చెందిన కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్ ఏఐ సిద్ధం చేస్తోన్న నాలెడ్జ్ ఫ్లాట్ ఫామ్ లాంచింగ్‍కు అంతా రెడీ అయినట్లు ప్రకటించారు. దాన్ని గ్రోకీపీడీయా (Grokipedia) పేర్కొన్న మస్క్ 0.1 బీటా వెర్షన్ రెండు వారాల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఎలాన్ మస్క్ వెల్లడించారు. నాలెడ్జి ప్లాట్ ఫామ్ వీకీపిడియా తరహాలో గ్రీకీపిడియా ఓ నాలెడ్జ్ హబ్‍గా ప్రపంచం ముందుకు రాబోతోంది.‘గ్రోక్ పీడియా ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన నాలెడ్జ్ సోర్స్. దీనికి హద్దులు లేవు’ అంటూ @amXFreeze అనే ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు ఎలాన్ మస్క్ ఇవాళ రిప్లయ్ ఇచ్చారు. మరో రెండువారాల్లో గ్రోకీమీడియా 0.1 బీటా వెర్షన్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత సెప్టెంబర్‍లో మస్క్ ఈ గ్రోకీపీడియా అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. తాజాగా వచ్చే రెండు వారాల్లో దాన బీటా వెర్షన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

ఫేక్ న్యూస్ యుగంలో అన్ని నిగ్గుతేలుతాయా?:

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని కృత్రిమ మేధ సంస్థ ఎక్స్‌ఏఐ తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. చాట్‌జీపీటీ తరహాలో పని చేస్తున్న గ్రోక్.. 2023లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఏఐ ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ సమాచారం అందిస్తూన్న గ్రోక్ క్రికెట్‌, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ అంశమైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్తూ అందరిని ఆకట్టుకుంది. ఈక్రమంలో బీజేపీ విషయంలో గ్రోక్ ఇచ్చిన సమాధానాలు గతంలో దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. గ్రోక్ ఇచ్చిన సమాధానాలు బీజేపీ ప్రత్యర్థులకు అనుకూలంగా ఉండటంతో ఈ చాట్ బాట్ కాంట్రవర్సీగా మారింది. ఈ క్రమంలో గ్రోక్‌ను అభివృద్ధి చేసిన ఎక్స్ఏఐ సంస్థనే ఇప్పుడు గ్రోకీపీడియా సిద్ధం చేస్తుండటంతో ఈ చాట్ బాట్ ఇచ్చే సమాచారం దేశ రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజమో ఏది అబద్దమే తేల్చుకోవడం కష్టతరంగా మారింది. ఎక్కడ చూసినా తప్పుడు వార్తలు, వక్రీకృత కథనాలు దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలో గ్రోకీపీడియా అన్ని నిజాలను నిగ్గు తేల్చబోతుందా? అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

Next Story