Legal Marriage Age : భారత్‌లో పెరుగుతున్న వివాహ వయస్సు

by S Gopi |

పట్టణ ప్రాంతాల్లో మహిళలు సగటున 24.4 ఏళ్ల వయస్సులోనూ, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏళ్ల వయస్సులోనూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

Legal Marriage Age : భారత్‌లో పెరుగుతున్న వివాహ వయస్సు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో మహిళల సగటు వివాహ వయస్సు గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 'శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే' (ఎస్ఆర్ఎస్), 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే' (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) గణాంకాల ప్రకారం, దేశంలో మహిళల సగటు వివాహ వయస్సు గతంలో ఉన్న 19.3 ఏళ్ల నుంచి 23.1 ఏళ్లకు చేరుకుంది. నేటి తరం మహిళలు చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వేచ్ఛకే తొలి ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ మార్పు కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మహిళలు సగటున 24.4 ఏళ్ల వయస్సులోనూ, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏళ్ల వయస్సులోనూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. విద్యా స్థాయి పెరగడం, ఉద్యోగ అవకాశాలు, పట్టణీకరణ, జీవన వ్యయం, ఉపాధి కోసం వలసలు వంటి అంశాలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళల చట్టబద్ధ వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే బిల్లును కేంద్రం 2021లో ప్రవేశపెట్టినా, అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు 2027 జనాభా లెక్కల తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కల ఆధారంగా ఉన్నత విద్య, వివాహాల ఆలస్యం, సంతానోత్పత్తి రేటు, ఉపాధి, పట్టణీకరణ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభుత్వం విశ్లేషించనుంది.

జపాన్, దక్షిణ కొరియాల తరహా సంక్షోభం

రాష్ట్రాల వారీగా చూస్తే, మహిళల సగటు వివాహ వయస్సు జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా 26.3 ఏళ్లు ఉండగా, ఢిల్లీ (24.6), హిమాచల్ ప్రదేశ్ (24.3), ఉత్తరాఖండ్, తమిళనాడు (23.8 ఏళ్ల చొప్పున) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్ (21.6), బీహార్ (21.7), అస్సాం, రాజస్థాన్ (22.7 ఏళ్ల చొప్పున), ఆంధ్రప్రదేశ్ (22.8) అత్యల్ప సగటు వివాహ వయస్సు ఉన్న రాష్ట్రాలుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.9కి పడిపోయింది. పట్టణాల్లో అయితే ఇది మరీ తక్కువగా 1.5 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 2.1గా ఉంది. ఈ ధోరణి తూర్పు ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాల తరహా సంక్షోభాన్ని గుర్తు చేస్తోంది. దీని ప్రత్యక్ష ప్రభావం దేశ జనాభాపై స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి కాలం తగ్గి జనన రేటు కూడా క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 0–14 ఏళ్ల పిల్లల జనాభా వాటా 24 శాతానికి తగ్గగా, పని చేసే వయస్సు గల జనాభా 66.4 శాతానికి పెరిగింది. 60 ఏళ్లు పైబడిన వారి వాటా 9.7 శాతానికి చేరుకోవడం భారత్ జనాభా నిర్మాణంలో కొత్త దశ ప్రారంభమైన సంకేతంగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు, వివాహాలు ఆలస్యం కావడం, జనన రేటు తగ్గడం వల్ల భవిష్యత్తులో యువ శ్రామికశక్తి వృద్ధి మందగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగడంతో ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, సామాజిక భద్రతపై ప్రభుత్వ వ్యయం మరింత పెరిగే అవకాశముంది.

Next Story