ఎమ్మెల్యే వస్తే లేవలేదని డాక్టర్‍పై చర్యలు.. ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు

by Prasad Jukanti |

ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు డాక్టర్ లేవలేదనే కారణంతో అతనిపై చర్య తీసుకోవడానికి పూర్తిగా అన్యాయమని హైకోర్టు పేర్కొంది.

ఎమ్మెల్యే వస్తే లేవలేదని డాక్టర్‍పై చర్యలు.. ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా ప్రతినిధులు ఏదైనా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు వారి హడావుడి మామూలుగా ఉండదు. అధికారులంతా తమ చుట్టే చేరిపోవాలి, ఏ ప్రశ్న అడిగిన ఠంచన్‍గా సమాధానం ఇచ్చేయాలి అనేలా సదరు ప్రజాప్రతినిధుల ధోరణి కనిపిస్తుంటుంది. అలాంటి వారికి కనువిప్పు కలిగేలా తాజాగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు (Punjab And Haryana High Court) కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడలేదనే కారణంతో ఓ డాక్టర్‍పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రవర్తన సున్నితత్వం లేదనిదని ఇది చాలా బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికిరూ. 50 వేల జరిమానా విధించింది. వెంటనే సదరు డాక్టర్ ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అంకితభావంతో పని చేసే వైద్యనిపుణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అవాంఛనీయ సంఘటనలను అరికట్టాలని జస్టిస్ అశ్వినీ కుమార్ విశ్రా, జస్టిస్ రోహిత్ కపూర్ లతో కూడిన ధర్మాసం స్పష్టం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

డాక్టర్ మనోజ్ (Dr.Manoj) హర్యానా ప్రభుత్వంలో పని చేస్తున్న క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్. ఆయన కొవిడ్ -19 (Covid-19) సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో విధుల్లో ఉండగా ఒక ఎమ్మెల్యే (Mla Arrival In Emergency Ward) ఆసుపత్రి పరిశీలనకు వచ్చారు. ఈ క్రమంలో అత్యవసర వార్డును సందర్శించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాకను గమనించని మనోజ్ కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడవా అంటూ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో హర్యానా సివిల్ సర్వీసెస్ రూల్స్ 2016 ప్రకారం డాక్టర్ మనోజ్‍కు రాష్ట్ర ప్రభుత్వం షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసుకు స్పందించిన డాక్టర్ మనోజ్.. తాను ఎమ్మెల్యేను గుర్తించలేదని ఎమ్మెల్యే వచ్చినప్పుడు తాను లేచి నిలబడకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని 2024 జూన్‍లో సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో తన తదుపరి వైద్య విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఎన్‍వో‍సీని మనోజ్ కోరారు. అయితే షోకాజ్ నోటీసులు అంశం పెండింగ్‍లో ఉన్నందునా ప్రభుత్వం అతడికి ఎన్‍వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది.

ఈ వ్యవహారంపై డాక్టర్ మనోజ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఒక ఎమ్మెల్యే ఆసుపత్రి అత్యవసర వార్డులోకి ప్రవేశించినప్పుడు వైద్యుడు లేచి నిలబడతాడని ఆశించడం అతడు లేవకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించడం చాలా బాధాకరం అని కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేను తాను గుర్తించలేదని ఈ చర్య ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పిటిషనర్ ఇచ్చిన వివరణను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడింది. అలాగే షోకాజ్ నోటీసు పెండింగ్ ఉన్నందున ఎన్‍వోసీ నిలిపివేయడం ద్వారా వైద్య విద్యను అభ్యసించే హక్కును నిరాకరించడం ఏకపక్షంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా వైద్య విద్య కోర్సు ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు అసాధారణంగా బాగా రాణించాలని కోర్టు గుర్తుచేసింది. రోగుల బంధువులు లేదా ప్రజా ప్రతినిధులు సరైన కారణం లేకుండా అంకితభావంతో వ్యవహరించే వైద్య నిపుణులను దుర్వినియోగం చేస్తున్నట్లు వార్తాపత్రికలలో తరచుగా నివేదికలు వెలువడటం మేము బాధతో గమనిస్తున్నాము. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలను తనిఖీ చేసి, నిజాయితీగల వైద్య నిపుణులకు తగిన గుర్తింపు ఇచ్చే సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది.

Next Story