ఎండల ఎఫెక్ట్.. ‘కూలింగ్ జోన్’ ఏర్పాటు చేసిన ప్రభుత్వం: టెంట్లు కాదు, చెట్లు నాటాలంటూ విమర్శలు

by Ramesh Naini |

మండిపోతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తన ‘హీట్-వేవ్ యాక్షన్ ప్లాన్’ కింద ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఎండల ఎఫెక్ట్.. ‘కూలింగ్ జోన్’ ఏర్పాటు చేసిన ప్రభుత్వం: టెంట్లు కాదు, చెట్లు నాటాలంటూ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో మండిపోతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తన ‘హీట్-వేవ్ యాక్షన్ ప్లాన్’ (Heat-wave Action Plan) కింద ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాత ఢిల్లీలోని జామా మసీదు సమీపంలో జిల్లా యంత్రాంగం ‘కూలింగ్ జోన్’ను (Cooling Zone) ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఏర్పాట్లపై ఒకపక్క ప్రశంసలు వస్తున్నప్పటికీ.. మరోపక్క ‘తాత్కాలికంగా టెంట్లు వేయడం కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటాలి’ అంటూ తీవ్ర విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.

‘కూలింగ్ జోన్’ ప్రత్యేకతలు..

మండుటెండల్లో బయటకు వచ్చే ప్రజలు, పాదచారులు కాసేపు సేదతీరేందుకు వీలుగా ఈ టెంటు లాంటి ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 70 నుంచి 80 మంది వరకు విశ్రాంతి తీసుకునేలా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. చల్లదనం కోసం కూలర్లు, వడదెబ్బ (Heatstroke) బారిన పడకుండా ఉండేందుకు నిరంతరం చల్లటి తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) కలిపిన నీటిని అందుబాటులో ఉంచారు. ప్రజలకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వ సిబ్బందిని ఇక్కడ అందుబాటులో ఉంచారు. పర్యాటకులు, ప్రయాణికులు, రిక్షా కార్మికులు, రోజువారీ కూలీలు, వృద్ధులకు ఈ కేంద్రం తీవ్రమైన ఎండల నుంచి ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటన

ఈ ఉపశమన చర్యలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ.. కేవలం ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని, ప్రజలకు ప్రత్యక్షంగా, వాస్తవికమైన ఉపశమనం అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వేసవిలో మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు, పర్యాటక ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకే పాత ఢిల్లీ లాంటి జనసాంద్రత గల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆమె పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే సంచరిస్తున్న ‘మొబైల్ హీట్ రిలీఫ్ వాహనాల’కు అదనంగా ఈ స్థిరమైన కూలింగ్ జోన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని శాఖలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు.

‘టెంట్లు కాదు.. చెట్లు కావాలి’!

ప్రభుత్వం చేపట్టిన ఈ ఉపశమన చర్యలపై పర్యావరణవేత్తలు, కొందరు నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నిజమైన కూలింగ్ జోన్లు అంటే కాంక్రీట్ అడవుల్లో చెట్లు నాటాలి. కానీ ఇలా ఎండాకాలం రాగానే టెంట్లు వేసి, ముఖాలు తుడుచుకునే ఏర్పాట్లు చేసి ‘కూలింగ్ జోన్లు’ అని పేరు పెట్టడం సరైన శాశ్వత పరిష్కారం కాదు’ అంటూ విమర్శకులు పెదవి విరుస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఎండలు ఇలా మండిపోతున్నాయని, చెట్లు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story