- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాసెక్టమీ రివర్స్ సర్జరీలతో కొత్తజీవితం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చిన మాజీ మావోయిస్టుల జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చిన మాజీ మావోయిస్టుల జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సమయంలో బలవంతంగా లేదా సంస్థ నిబంధనల ప్రకారం కుటుంబ నియంత్రణ (నసబందీ or వాసెక్టమీ రివర్స్ సర్జరీలు) చేయించుకున్న మాజీ కేడర్లకు ఇప్పుడు కుటుంబాన్ని విస్తరించుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మావోయిస్టు సంస్థలో పనిచేసే సభ్యులు కుటుంబాన్ని పెంచకూడదనే కఠిన నిబంధన అమల్లో ఉండేది. అడవుల్లో ఉండి ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉండటంతో వివాహం చేసుకున్న సభ్యులకు సంతానం కలగకుండా నసబందీ చేయించేవారని మాజీ మావోయిస్టులు వెల్లడించారు. సంస్థలోని వైద్య బృందాలే ఈ శస్త్రచికిత్సలు నిర్వహించేవని చెబుతున్నారని ఓ యూట్యూబ్ ఛానల్ పేర్కొంది.
రివర్స్ ఆపరేషన్లు సేఫేనా?
ఇప్పుడు లొంగిపోయిన అనంతరం సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్న మాజీ మావోయిస్టుల నుంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కోరిక వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిపింది. నసబందీని తిరిగి రద్దు చేసే (వాసెక్టమీ రివర్స్) శస్త్రచికిత్సలు సురక్షితంగా నిర్వహించవచ్చని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రాథమికంగా 60 మంది మాజీ మావోయిస్టులను ఎంపిక చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వైద్యుల బృందాలు జగదల్‌పూర్‌కు చేరుకుని మహారాణి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభించాయి. తొలి దశలో సుమారు 30 మందికి వాసెక్టమీ రివర్స్ ప్రక్రియ చేపట్టగా, మిగిలిన వారికి వచ్చే వారంలో చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదా?
ఈ సందర్భంగా మాజీ మావోయిస్టులు శంకర్, రాజు సలామ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. మావోయిస్టు సంస్థలో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం నసబందీ చేయించుకున్నామని, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చాక కుటుంబంతో కలిసి జీవించాలని, పిల్లలను చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడపాలని తమ లక్ష్యమని తెలిపారు. అయితే మరోవైపు కొంతమంది మాజీ మావోయిస్టులు ప్రభుత్వ పునరావాస విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. లొంగిపోయిన తర్వాత ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కావడం లేదని వారు ఆరోపిస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ నసబందీ రివర్స్ కార్యక్రమాన్ని మాజీ మావోయిస్టుల పునరావాసంలో కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యతో అడవుల్లో ఆయుధ పోరాటం సాగించిన మాజీ మావోయిస్టులు ఇప్పుడు కొత్తఆశలతో కుటుంబ జీవితాన్ని ప్రారంభించే అవకాశాన్ని పొందుతున్నారు.






