భారత్‌, అమెరికా మధ్య సబ్‌-సీ కేబుల్‌ కనెక్టివిటీ.. ప్రకటించిన గూగుల్ CEO సుందర్ పిచాయ్

by Kema Shiva Kumar |

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించేందుకు గూగుల్ కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది.

భారత్‌, అమెరికా మధ్య సబ్‌-సీ కేబుల్‌ కనెక్టివిటీ.. ప్రకటించిన గూగుల్ CEO సుందర్ పిచాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-అమెరికా మధ్య డిజిటల్ సంబంధాలను బలోపేతం చేసేలా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi) వేదికగా జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ (India AI Impact Summit)లో పాల్గొన్న ఆయన భారత్-అమెరికా మధ్య సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతర భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేలా పలు కీలక ప్రాజెక్టులను సుందర్ పిచాయ్ వెల్లడించారు.

ఏఐ వినియోగంలో భారత్ ఓ నమూనా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అనేది మన జీవితకాలంలోనే అతిపెద్ద సాంకేతిక మార్పుని అన్నారు. భారత్ ఈ రంగంలో అద్భుతమైన వృద్ధి పథంలో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి భారత్ ఒక నమూనాగా (Blue Print) నిలుస్తుందని పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా సౌత్ హాంప్‌షైర్‌లోని ఇతర దేశాల మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి కొత్త సముద్రగర్భ (Subsea) కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా అమెరికా-భారత్ మధ్య 4 మార్గాలు, భారత్ నుంచి సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు 3 కొత్త మార్గాలను లింక్ చేయనున్నామని తెలిపారు. ఇక గతంలో ప్రకటించినట్లుగా విశాఖపట్నం (Vishakhapatnam)లో 15 బిలియన్ డాలర్ల వ్యయంతో గూగుల్ తన భారీ ఏఐ హబ్‌ను నిర్మిస్తోందని గుర్తు చేశారు. ఇది గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ పవర్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వేని కలిగి ఉంటుందని పిచాయ్ తెలిపారు.

ఇక భారత్‌లోని విద్యార్థులు, నిపుణుల కోసం గూగుల్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్’ ప్రోగ్రామ్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రారంభించనుంది. గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind), భారత ప్రభుత్వం సంయుక్తంగా 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ ద్వారా దాదాపు 11 మిలియన్ల మంది విద్యార్థులకు జెనరేటివ్ ఏఐ టూల్స్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. సుమారు 20 మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ‘కర్మయోగి భారత్’తో గూగుల్ చేతులు కలిపింది. అలాగే సైన్స్ రంగంలో పరిశోధనల కోసం 30 బిలియన్ మిలియన్ల నిధిని ఇప్పటికే ప్రకటించారు.

Next Story